హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో దారుణమైన ఘటన జరిగింది. ఓ వ్యక్తి తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చంపేసి, ముక్కలు చేసి, డ్రమ్ములో కుక్కి పారిపోయాడు. రెండో పెళ్లి చేసుకున్న 9 నెలల్లోపే ఈ దారుణం జరిగింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. 


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లాకు చెందిన ముదావత్ భీముడు అనే వ్యక్తి హైదరాబాద్ లోని హఫీజ్ పేటలో నివాసం ఉంటున్నాడు. అతని పెద్ద కూతురు 21 ఏళ్ల సరోజ. ఈమె కొత్తగూడలోనే ఓ మాల్ లో పని చేస్తుండేది. ఈమెకు ఫ్లవర్ షాప్ నడిపే అనీల్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమగా మారడంతో 9 నెలల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. 


అప్పటి నుంచి వీరు ఇద్దరూ రహమత్ నగర్ ప్రాంతంలో వేరు కాపురం పెట్టారు. అయితే, ఆ వివాహం తర్వాతే సరోజకు దిగ్ర్భాంతికర విషయం తెలిసింది. తన భర్తకు అంతకుముందే వివాహం జరిగిందని, నలుగురు పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. భర్త భార్యను కొట్టడం మొదలుపెట్టాడు.


గత జూన్ 1న తనను భర్త కొట్టినట్లుగా సరోజ పుట్టింటికి ఫోన్ చేసింది. మరుసటి రోజు నుంచి ఫోన్ కలవకపోవడంతో ఆందోళన చెందిన పుట్టింటివారు సరోజ ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో అల్లుడికి ఫోన్ చేశారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తాళం పగలకొట్టి లోనికి వెళ్లి చూడగా, పూర్తిగా దుర్వాసన వచ్చింది. మొత్తం పరిశీలించగా నీళ్ల డ్రమ్ములో సరోజ శవం కనిపించింది. 


డంబెల్ తో మోది హత్య
నిందితుడు తన భార్య శవాన్ని ముక్కలుగా చేసి డ్రమ్ములో కుక్కి పరారయ్యాడు. సోమవారం రాత్రి లొంగిపోయాడని పోలీసులు తెలిపారు. నిందితుడి గురించి మాట్లాడుతూ.. 2009లో అనిల్ కుమార్ అనిత అనే మహిళను వివాహం చేసుకున్నాడని, వారిద్దరికి నలుగురు పిల్లలు పుట్టారని తెలిపారు. ఆ తర్వాత అదనపు కట్నం కోసం వేధింపులు చేశాడని అన్నారు. 


కరెంట్ హీటర్ తో మొదటి భార్య హత్య
2020 మే 30న మొదటి భార్యను కరెంటు హీటర్ తో కొట్టి, తలను గోడకేసి కొట్టి చంపాడని తెలిపారు. ఆ కేసులో రిమాండ్ లో ఉండి గత ఏడాది బెయిల్ పై బయటికి వచ్చాడని పోలీసులు తెలిపారు. ఇంతలోనే మరో యువతిని పెళ్లి చేసుకొని ఆమెను కూడా కిరాతకంగా పొట్టన పెట్టుకున్నాడని చెప్పారు. కుమార్తె చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.