హైదరాబాద్ వరుస అత్యాచార ఘటనలు కలవరం రేపుతున్నాయి. జూబ్లీహిల్స్ లో 17 ఏళ్ల బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచార ఘటన మర్చిపోక ముందే అలాంటి మరో అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సికింద్రాబాద్ లోని కార్ఖానా పరిధిలో జరిగింది. ఒక బాలికపై ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఐదుగురిలో ఓ బాలుడు ఉండగా మిగతా నలుగురిపై పోలీసులు పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. మైనర్ ను జువైనల్ హోంకు తరలించారు.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రాథమిక వివరాలు ఇవీ.. బాధిత బాలిక ధీరజ్, రితేశ్ అనే యువకులకు ఇన్ స్టాగ్రాంలో పరిచయం. ఆ తర్వాత వారు కలుసుకున్నారు. మాయమాటలు చెప్పి ఆమెను లొంగ తీసుకున్నారు. అఘాయిత్యానికి పాల్పడే సమయంలో వీడియోలు తీసి ఎక్కడైనా చెప్తే ఆ వీడియోలు బయట పెడతామంటూ బెదిరించారు. ఈ ఘటన దాదాపు రెండు నెలల క్రితం జరిగినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో కూడా బాలిక ప్రవర్తనపై అనుమానం వచ్చి సైక్రియాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్లడంతో అసలు విషయం బయటికి వచ్చింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.