ED Searches : దిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు పెంచింది. తెలంగాణలో మరోసారి వరుస దాడులు నిర్వహిస్తోంది. దిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో హైదరాబాద్, కరీంనగర్ లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. హైదరాబాద్ లో  పది ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. మూడు ఐటీ కంపెనీలు, 2 రియల్ ఎస్టేట్ ఆఫీసుల్లో సోదాలు చేశారు. దిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారుల బృందం ఈ తనిఖీలు చేపట్టింది. కరీంనగర్ కు చెందిన స్థిరాస్తి వ్యాపారి నివాసంలో సోదాలు చేసిన ఈడీ,  అనంతరం శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని ఈడీ కార్యాలయానికి తరలించింది.  


తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ తనిఖీలు 


హైదరాబాద్ లోని రామంతాపూర్, బంజారాహిల్స్, మాదాపూర్ తో పాటు ఇతర ప్రాంతాల్లో దాడులు చేసింది ఈడీ. కరీంనగర్‌ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు నిర్వహించింది. శుక్రవారం దేశంలోని వివిధ ప్రాంతాల్లో మరోసారి తనిఖీలు చేపట్టిన ఈడీ ఏపీ, తెలంగాణ సహా దిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 40 చోట్ల ఏకకాలంలో దాడులు చేసింది.  ఇందులో భాగంగా 25 ప్రత్యేక బృందాలు  సోమవారం ఉదయం నుంచే నగరంలోని పలు సంస్థల కార్యాలయాలు, నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. దిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో నిందితుల్లో ఒకరైన రామచంద్రన్ పిళ్లై యాజమాన్యంలోని రాబిన్ డిస్టిలరీస్ కార్యాలయంలో ఈడీ తనిఖీలు చేసింది. అదే సమయంలో దోమలగూడ అరవింద్‌ కాలనీలోని శ్రీ సాయికృష్ణ అపార్ట్‌మెంట్‌లో చార్టెడ్‌ అకౌంటెంట్‌ గోరంట్ల బుచ్చిబాబుకు చెందిన గోరంట్ల అసోసియేట్స్‌ ఆఫీస్, నివాసంపై దాడులు చేశారు. సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది సహకారంతో ఈడీ అధికారులు బుచ్చిబాబు నివాసం, కార్యాలయంలో తనిఖీలు చేసింది. పలు సంస్థలకు చెందిన ఫైళ్లను గుర్తించారు. కరీంనగర్ లో ఇద్దరు రియల్ ఎస్టేట్ బిల్డర్ల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. 


హైదరాబాద్ లో తనిఖీలు 


గచ్చిబౌలిలోని అభిషేక్ నివాసం, మాదాపూర్‌లోని అనూస్ ప్రధాన కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి చెందిన దిల్లీ, నెల్లూరు నివాసాల్లోనూ ఈడీ సోదాలు చేసింది. నెల్లూరులోని కోటిమొబ్బ సెంటర్‌లో ఉన్న శ్రీనివాసులు ఆఫీసు, చెన్నైలోని మాగుంట అగ్రిఫారంలో ఈడీ అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈడీ నుంచి నోటీసులు అందుకున్న వారిలో అరుణ్ రామచంద్రన్ పిళ్లై, ఐఏఎస్ అధికారి అర్వ గోపీ కృష్ణ, మాగుంట రఘు, అభిషేక్, గోరంట్ల బుచ్చిబాబు, చందన్ రెడ్డి, వై. శశికళ ఉన్నారు.   


రాజకీయ దాడులు కాదు 


దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు రేపుతున్నాయి. ఇందులో భాగంగా ఈడీ అధికారులు ఏపీ, తెలంగాణలోనూ పలు చోట్ల వరుస సోదాలు చేశారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పై ఆరోపణలు వచ్చాయి. తనపై వచ్చిన ఆరోపణలపై ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి స్పందించారు. మాపై వచ్చిన లిక్కర్ ఆరోపణలు నిరాధారమైనవి అన్నారు. ఢిల్లీ లిక్కర్ వ్యాపారానికి తమకు ఏ సంబంధం లేదని స్పష్టం చేశారు.  తమ కుటుంబం 70 ఏళ్ల నుండి లిక్కర్ వ్యాపారంలో ఉన్నదని చెప్పారు. 8 రాష్ట్రాలలో మా వ్యాపారాలు ఉన్నాయని, ఎక్కడ మచ్చ లేని వ్యాపారం చేస్తున్నామని ఎంపీ మాగుంట తెలిపారు. తమ చెన్నె, ఢిల్లీ వివాసాల్లో ఇటీవల ఈడీ అధికారులు దాడులు చేశారని, కానీ వారికి అక్రమాలు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. పోలీసులు పంచనామాలో కూడా ఇదే రాశారని వెల్లడించారు. తమతో పాటు దేశ వ్యాప్తంగా 32 మంది వ్యాపారులపై ఈడీ తనిఖీలు చేపట్టిందన్నారు. మా కుటుంబం రాజకీయాలో, వ్యాపారాలలో నీతిగా ఉన్నామని, ఎక్కడ అక్రమాలకు పాల్పడిన దాఖలాలు లేవన్నారు. 2024 లో తన కుమారుడు ఒంగోలు ఎంపీ గా పోటీ చేస్తారని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. తాజాగా ఈడీ జరిపింది కేవలం కేవలం వ్యాపారపరమైన దాడులు గానే భావిస్తున్నామని, ఇవి రాజకీయ దాడులు కానే కాదన్నారు.


Also Read : KCR BJP Agenda : తెలియకుండానే బీజేపీ ట్రాప్‌లో టీఆర్ఎస్ - కేసీఆర్ నిర్ణయాలు కమలం పార్టీకే మేలు చేస్తున్నాయా ?