హైదరాబాద్‌లో చైల్డ్ పోర్న్ ముఠాను పోలీసులు గుర్తించారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వీరు వివిధ సైట్లలోకి ఆ వీడియోలను అప్ లోడ్ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు మూడు చైల్డ్ పోర్న్ కేసులను గుర్తించారు. త్వరలోనే వీరిపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. గత కొన్నేళ్ళుగా చైల్డ్ పోర్న్ వీడియోస్ పై నిఘా పెట్టిన సైబర్ టిప్ లైన్.. అప్‌లోడ్ చేసిన వీడియోల అధారంగా హైదరాబాద్ లో మూడు ఐపీ అడ్రస్‌ల ద్వారా చైల్డ్ పోర్న్ వీడియోలు అప్‌లోడ్ చేసినట్టు గుర్తించారు. సైబర్ టిప్ లైన్ ఈ వివరాలను సీఐడీకి అందించడంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
సైబర్ టిప్ లైన్ తెలంగాణ సీఐడీకి అందించిన వివరాలు సేకరించిన ప్రకారం.. ఐపీ అడ్రస్‌ల ద్వారా ఈ పనులకు పాల్పడేవారిని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లోని రసూల్ పుర, టోలిచౌకీ, వారాసి గూడా ప్రాంతాల నుంచి ఈ వీడియోలు అప్‌లోడ్ అవుతున్నట్లుగా గుర్తించారు. గత ఐదేళ్ల నుంచి అంటే 2017, 2019, 2020 లలోకూడా రసూల్ పురా, టోలిచౌకి, వారాసి గూడా ప్రాంతాల నుంచి వీడియోలు అప్ లోడ్ చేశారు.
2021లో దేశవ్యాప్తంగా చైల్డ్ పోర్నోగ్రఫీ అప్ లోడర్స్ పై సీబీఐ దాడులు చేసింది. 2021 లో హైదరాబాద్ లో చైల్డ్‌పోర్న్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తోన్న 16 మందిని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. అంతకు ముందు 2020 లో అప్‌లోడ్ చేసిన విడియోలను ఫార్వర్డ్ చేసిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు తాజాగా మరో మూడు కేసులను సైబర్ టిప్ లైన్ గుర్తించింది. నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్‌తో అనే అమెరికా సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలపై ఫిర్యాదు చేసేందుకు సెంట్రలైజ్డ్ రిపోర్టింగ్ సిస్టమ్ సైబర్ టిప్ లైన్ ఏర్పాటుచేశారు. రిపోర్ట్ ని NCRB ద్వారా మెట్రో నగరాలకు చేరవేసే సిస్టంను ఏర్పాటు చేశారు.
రాచకొండ పరిధిలో యువకుడు అరెస్టు
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఓ యవకుడు పోర్న్ లింకులు, వీడియోలను ఓ యువతికి పంపుతున్న నేరం కింద అతణ్ని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో అది నిజమని తేలడంతో 27 ఏళ్ల వరికుప్పల చంద్రశేఖర్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఇతను రంగారెడ్డి జిల్లా యాచారాం లో నివసిస్తున్నారు. పోలీసులు మాట్లాడుతూ ఈ వ్యక్తి కొంత కాలంగా పోర్న్ చూడడానికి అలవాటు పడ్డాడు. వాటి ప్రభావంతోనే ఆ సైట్లకు సంబంధించిన లింకులను యువతికి పంపుతూ వేధించేవాడు. ఆ యువతి వాటిని భరించలేక, పోలీసులకు సమాచారం అందించడంతో అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.