Hyderabad Crime News:  హైదరాబాద్‌లో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టడం సంచలనంగా మారింది. రాజేంద్రనగర్ లోని బద్వేల్ ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో సోమవారం రాత్రి పలువురు దుండగులు తవ్వకాలు జరిపారు. ఈ విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలోనే తవ్వకాలు చేపడుతున్న తొమ్మిది మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుల నుంచి మూడు కార్లు, 16 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దీని కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టడం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. 


అయితే అరెస్ట్ అయిన నిందితులు గత రెండేళ్లుగా ఖాళీగా ఉన్న ఇంట్లో తవ్వకాలు చేపడుతున్నారు. అయితే ఈ ఇల్లు ఇందిరమ్మ అనే ఓ మహిళకు సంబంధించింది. అయితే గుప్తనిధులు తవ్వేందుకు నేతృత్వం వహించిన వ్యక్తి ఇంటి ఓనర్ ఇందిరమ్మ రెండో అల్లుడు వినోద్. ఓ బాబా సహాయం తీసుకున్న ఇతను.. కొంత మందిని ఇంటికి పిలిపించుకొని గత మూడ్రోజులుగా తవ్వకాలు చేపడుతున్నాడు. అయితే తరచూ చప్పుడు రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే రాజేంద్రనగర్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా వానికి పట్టుకొని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


గతేడాది ఫిబ్రవరిలో వరంగల్ లో ఇలాంటి ఘటనే


వ‌రంగ‌ల్ జిల్లా గీసుగొండ మండ‌లం గంగ‌దేవిప‌ల్లిలో గుప్త‌నిధుల త‌వ్వ‌కాలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. త‌వ్వ‌కాల‌కు పాల్ప‌డిన 8మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో గంగ‌దేవిప‌ల్లి గ్రామానికి చెందిన యార‌ మల్లారెడ్డి, మ‌హ‌బూబాబాద్ జిల్లా గూడూరుకు చెందిన‌ పంజరబోయిన శ్రీనివాస్, గంగ‌దేవిప‌ల్లికి చెందిన‌ మేడిద కృష్ణ, నెక్కొండ మండ‌లం అమీన్‌పేట‌కు చెందిన పూజారి యాత పూర్ణ చందర్‌లు ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. అరెయార రమణయ్య , యార రాజయ్య, యార కుమారస్వామి, గీసుగొండ రాజిరెడ్డిలు ప‌రారీలో ఉన్నారని చెప్పారు. తవ్వకాలలో బయటపడిన  30 రాగి నాణెలతో పాటు ఓ కారును స్వాధీనం చేసుకున్న‌ట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభ‌వ్ గైక్వాడ్ పేర్కొన్నారు.


డీసీపీ వైభ‌వ్ గైక్వాడ్ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. యార మల్లారెడ్డికి గంగాదేవి గ్రామంలో స‌ర్వే నెంబ‌ర్ 375లో 1.8 ఎకరాల భూమి ఉంది. త‌న పంట భూమిలో గుప్త నిధులున్న‌ట్లుగా తెలుసుకున్నాడు. రెవెన్యూ అధికారుల‌కు, పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వాల్సి ఉన్నా అలా చేయ‌లేదు. గుప్త నిధులు వెలికి తీయాల‌ని నిర్ణ‌యించుకున్న మ‌ల్లారెడ్డి గ‌త నెల 23న అదే గ్రామానికే చెందిన‌ పంజ‌ర‌బోయిన శ్రీనివాస్‌, మేడిద కృష్ణ‌, యాట పూర్ణచందర్‌లతో కలిసి త‌వ్వ‌కాలు జ‌రిపాడు. ఈ త‌వ్వ‌కాల్లో 1818 నాటి 30 పాత రాగి నాణేలను బయటపడ్డాయి. తర్వాత మహేష్ సహాయంతో హైదరాబాద్‌లో వాటిని విక్రయించేందుకు మ‌రుస‌టి రోజు నుంచే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. టాస్క్‌ఫోర్స్ అధికారుల‌కు సమాచారం తెలియ‌డంతో నిందితుల‌పై నిఘా పెట్టారు. హైద‌రాబాద్‌లో అమ్మేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌గా వ‌రంగ‌ల్ క‌మిష‌న‌రేట్ టాస్క్‌ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు నిందితుల‌ను గీసుగొండ పీఎస్‌లో అప్ప‌గించిన‌ట్లు తెలిపారు.


వెయ్యి బంగారు నాణెలతో పాటు రాగి నాణెలు..


గంగ‌దేవిప‌ల్లి యార మల్లారెడ్డి  జ‌రిపిన త‌వ్వ‌కాల్లో పెద్ద ఎత్తున బంగారం ల‌భ్య‌మైన‌ట్లుగా గ్రామ‌స్తుల మ‌ధ్య చ‌ర్చ జ‌రుగుతోంది. రాగి నాణెల‌తో పాటు దాదాపు 1000 బంగారు నాణెలు ల‌భ్యమైన విష‌యం వారం రోజుల క్రితం గ్రామస్తులకు తెలిసిన‌ట్లు స‌మాచారం. దాదాపు రెండున్న‌ర కిలోల వ‌ర‌కు ఉండొచ్చ‌ని స్థానికంగా మాట్లాడుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే విష‌యం బ‌య‌ట‌కు తెలిస్తే అస‌లుకే మోసం వ‌స్తుంద‌నే ఉద్దేశంతోనే బంగారం విష‌యం వెలుగులోకి రాకుండా రాగి నాణెల దొరికిన‌ట్లుగా సీన్ క్రియేట్ చేసిన‌ట్లుగా గ్రామ‌స్తులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా కేసును పెద్ద‌గా సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేద‌ని వాపోతున్నారు.