Hyderabad Chain Snatchers : రాచకొండ కమిషనరేట్ పరిధిలో శనివారం ఉదయం ఆరున్నర నుంచి తెలంగాణ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన చైన్ స్నాచర్లు వరంగల్ లో చిక్కారు. హైదరాబాద్ లో ఆరు చోట్ల స్నాచింగులు జరగడంతో తెలంగాణ పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో నిఘా పెంచారు. పోలీసులు ఊహించినట్టుగానే కేటుగాళ్లు రైళ్లో పారిపోయేందుకు యత్నించారు. అప్పటికే రైల్వే స్టేషన్లలో నిఘా పెంచడంతో వరంగల్ జిల్లా కాజీపేటలో సినీఫక్కీలో పట్టుకున్నారు.


కాచిగూడ నుంచి కాజీపేట


ఉప్పల్, నాచారం, ఓయూ, రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కంత్రీగాళ్లు వరుసగా స్నాచింగులకు పాల్పడ్డారు. ఉదయం 6:20 గంటలకు ఉప్పల్,  6:40 గంటలకు కళ్యాణ్‌పురి, 7:10 గంటలకు నాగేంద్ర నగర్, 7:40 గంటలకు రవీందర్ నగర్, 8:00 గంటలకు చిలకలగూడ పీఎస్ రామాలయం గుండు దగ్గర, . 8:10 గంటలకు రాంగోపాల్‌పేట్  రైల్వే స్టేషన్ సమీపంలో దుండగులు మహిళల మెడలోంచి బంగారు గొలుసులు తెంపుకెళ్లారు. వరుస చైన్ స్నాచింగులతో హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని ప్రజల్లో భయాందోళన నెలకొంది. స్నాచర్లను పట్టుకునేందుకు పోలీస్ బృందాలు రంగంలోకి దిగారు. చైన్ దొంగల కోసం హైదరాబాద్‌లోని అన్ని చోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్‌లో పారిపోతుండగా వరంగల్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. కాజీపేట రైల్వేస్టేషన్‌ను దొంగలను పట్టుకున్నారు.


ఒంటరిగా వెళ్తున్న మహిళలే టార్గెట్


రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళలనను టార్గెట్ చేసుకుని మెడలో బంగారు మంగళసూత్రాలు, చైన్లను లాక్కెళ్తున్నారు. హైదరాబాద్ సిటీలో ఆరుచోట్ల గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు కేటుగాళ్లు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పొద్దుపొద్దున రెండుచోట్ల గొలుసులు లాక్కెళ్లారు. మరోవైపు ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని రవీంద్ర నగర్ కాలనీలోనూ ఓ మహిళ మెడలో నుంచి 2 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు వెంబడించినా దొరకకుండా పారిపోయాడు. నాచారం పీఎస్ పరిధిలో నాగేంద్ర నగర్లో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న వృద్ధురాలి మెడలో 5తులాల మంగళసూత్రం తెంపుకెళ్లారు. చిలకలగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని రామాలయం గుండు దగ్గర కూడా మహిళ మెడలోని పుస్తెల తాడును లాక్కెళ్లారు. సికింద్రాబాద్ లోని రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణ నగర్ కాలనీలో చైన్ స్నాచింగ్ కి పాల్పడ్డారు. 


గంటల వ్యవధిలోనే చైన్ దొంగల అరెస్ట్


కొత్త ఏడాది, అదికూడా రాచకొండకు కొత్త కమిషనర్ ను వచ్చిన కొద్దిరోజులకే వరుస స్నాచింగులు జరగడంతో పోలీసులకు ప్రెస్టీజియస్ సవాల్ గా మారింది.  ఈ కేసును చాలెంజ్ గా తీసుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే చైన్ స్నాచింగ్ ముఠాను పట్టుకున్నారు.


బార్ యాజమానిని బెదిరించి రూ.2కోట్లు దోపిడీ


వనస్థలిపురంలో ఓ బార్ యాజమాని నుంచి రెండు కోట్ల రూపాయలు దోపిడీ చేసినట్టు తెలుస్తోంది. గతరాత్రి బార్ రెండు బార్లు, వైన్ షాపుల నుంచి కలెక్షన్లు తీసుకుని ఇంటికి వెళ్తున్న మేనేజర్ వెంకట్రామిరెడ్డిని దండగులు ఫాలో చేశారు. వనస్థలిపురం చౌరస్తాలో వెంకట్రామిరెడ్డిని అడ్డగించారు. అతనిపై దాడి చేసి  రూ.2 కోట్లు లాక్కెళ్లిన దుండగులు లాక్కెళ్లారు. పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు.