CI Nageswararao Arrest : హైదరబాద్ లో ఓ వివాహితను గన్ తో బెదిరించి అత్యాచారం చేసిన మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇటీవల సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ భూకబ్జా వ్యవహరంలోనూ నాగేశ్వరరావు అక్రమాలకు పాల్పడినట్లు తాజాగా వెలుగుచూసింది. వందల కోట్ల విలువైన బంజారాహిల్స్ భూకబ్జా కేసులో ఒక్కొక్కటిగా నిజాలు బయటకు వస్తున్నాయి. ప్రభుత్వ స్థలాన్ని అతి తక్కువ ధరకే కొట్టేయాలని భావిస్తున్న ఓ ప్రైవేటు సంస్థకు సీఐ నాగేశ్వరరావు అండగా నిలిచి కేసుని తారుమారు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. 


నేను కూడా బాధితుడ్నే- టీజీ వెంకటేశ్ 


బంజారాహిల్స్ భూ కబ్జా కేసులో అవతలి పక్షం నుంచి డబ్బులు తీసుకుని అసలు హక్కుదారుల్నే కబ్జాదారులుగా సీఐ నాగేశ్వరరావు మార్చేశారని బాధితులు చెబుతున్నారు. 60 నుంచి 70 మందిని ఒకేసారి పోలీసులు అరెస్టు చేయడంతో అప్పట్లో ఈ కేసు సంచలం సృష్టించింది.  వీరంతా రాయలసీమ గూండాలంటూ మీడియాలో ప్రచారం చేశారు. మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ ని కూడా ఈ కేసులో ఏ5గా చేర్చారు. ఆ తర్వాత తీసేశారు. అంతేకాకుండా ఈ కేసులో ఏ4గా బాధితుల తరుపు అడ్వకేట్ ని కూడా ఇరికించడం వివాదాస్పదమైంది. ఇదంతా నాగేశ్వరరావు కట్టుకథేనని బాధితులు చెబుతున్నారు. ఈ మేరకు టీజీ వెంకటేష్ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. తనకు ఎంపీగా రెన్యూవల్ వచ్చే సమయంలో ఈ కేసులో ఇరికించారని, తనకు సంబంధం లేదని హక్కుదారులే నేరుగా రాతపూర్వకంగా ఇచ్చినా సీఐ దుర్మార్గంగా వ్యవహరించి డబ్బు డిమాండ్ చేశారని టీజీ వెంకటేశ్వరరావు ఆరోపించారు.



కోర్టు సీరియస్ 


ఏ3గా ఉన్నా సుభాష్ పులిశెట్టి డ్రైవర్ మణికంఠ అనే వ్యక్తిని పదిరోజులు పైగా అక్రమంగా నిర్బంధించడంపై నాంపల్లి కోర్టు సీరియస్ అయింది. డ్రైవర్ తో పాటు సుభాష్ బీఎండబ్ల్యూ కారుని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ ఒంటిపై గాయాలు, కారు ఆచూకీ విషయంలో తప్పుడు అఫిడవిట్లు వేయడంపైనా కోర్టు సీరియస్ అయింది. మొత్తం వ్యవహారంపై అడ్వకేట్ కమిషనర్ తో కోర్టు విచారణ చేయించింది. చివరికి కారు టాస్క్ ఫోర్స్ కార్యాలయంలోనే ఉన్నట్టు అడ్వకేట్ కమిషనర్ రిపోర్టు ఇచ్చినా, సీఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని బృందం విచారణలో దారుణంగా వ్యవహరించారని బాధితులు ఆరోపిస్తున్నారు. కారు నెంబర్ ప్లేట్ తొలగించి ఆక్రమంగా స్వాధీనంలో ఉంచుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాదన నిజమేనని రుజువు కావడంతో కారు స్వాధీనం చేసుకునేలా  కోర్టు ఆదేశాలు ఇచ్చింది. 


సీఐ అరెస్టు 


తాజాగా నాగేశ్వరరావు దుర్మార్గాలు వెలుగులోకి రావడంతో తమకు జరిగిన అన్యాయంపై బాధితులు గళం విప్పారు. ప్రభుత్వంలోని పెద్దల అండదండలు ఉన్నాయంటూ తమని వేధించిన సీఐ నాగేశ్వరరావుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులకు, నాయకులకు కోట్ల రూపాయలు ఇచ్చి పోస్టింగ్ తెచ్చుకున్నాను, కాబట్టి నాకు కూడా అంతే డబ్బులు రావాలి అంటూ ప్రచారం చేసుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సీఐను విధుల నుంచి తొలిగించి కేసు నమోదు చేశారు. తాజాగా ఎస్ఓటీ పోలీసులు పరారీలో ఉన్న సీఐ నాగేశ్వరరావును అరెస్టు చేశారు.