Hyderabad Crime :  హైదరాబాద్‌లోని చందానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. శివాని అనే యువ మహిళా న్యాయవాది ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాల కారణంగా శివాని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈమెకు ఐదు సంవత్సరాల క్రితం అర్జున్‌ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. చందానగర్‌ పోలీస్ స్టేషన్ లో భర్త అర్జున్‌ లొంగిపోయాడు. 


ప్రేమ పెళ్లి కానీ 


చందానగర్ లక్ష్మీ విహార్‌ డిఫెన్స్‌ కాలనీలో మహిళా న్యాయవాది శివాని నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి ఆమె ఉంటున్న అపార్ట్ మెంట్ నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్యభర్తల మధ్య గొడవల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. శివాని ఐదేళ్ల కిందట అర్జున్‌ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి రెండేళ్ల కొడుకు ఉన్నాడు. శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో శివాని ఆత్మహత్య చేసుకున్నారు. శివాని భర్త అర్జున్‌ చందానగర్‌ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.



ఇవాళ కొడుకు పుట్టినరోజు ఇంతలోనే 


శివాని తల్లి తెలిపిన వివరాల ప్రకారం చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో మేనమామ ఆమెను పెంచి పెద్దచేసి న్యాయవాదిని చేశారు. శివాని చదువు వల్ల తాను రూ.10 లక్షలు అప్పులుపాలయ్యానని ఆమె మేనమామ వేధించేవాడు. ఐదుదేళ్ల క్రితం అర్జున్ తో ప్రేమ పెళ్లి తర్వాత సంపాదన మేనమామకు ఎందుకిస్తావని అర్జున్‌ శివానితో గొడవపడేవాడు. ఈ విషయంపై తరచూ భార్యభర్తలు గొడవ పడేవారు. శనివారం మరోసారి వీరి మధ్య గొడవ జరిగి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. శివాని కుమారుడి రెండో పుట్టినరోజును ఇవాళ జరుపుకోవాల్సి ఉండగా ఇంతలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. మృతురాలి తల్లి, సోదరుడి ఫిర్యాదుతో చందానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 


స్థానికంగా కలకలం 


మహిళా న్యాయవాది శివాని ఆత్మహత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ కలహాల కారణంగానే శివాని ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం  ఆస్పత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు జరుగుతుండేవని స్థానికులు తెలిపారని పోలీసులు అంటున్నారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. శివాని భర్త ఈ ఘటన తర్వాత పోలీసులకు సమాచారం అందించి స్టేషన్ లో లొంగిపోయాడు. శివాని భర్త అర్జున్ నుంచి ఇంకా వివరాలు సేకరించాల్సి ఉందని, ఈ కేసు దర్యాప్తులో నిజానిజాలు వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.