YS Bhaskar Reddy Remand : వివేకా  హత్య కేసులో అరెస్టైన వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. ఈ నెల 29 వరకు భాస్కర్ రెడ్డికి రిమాండ్ విధించింది. ఆర్యోగ కారణాల దృష్ట్యా ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని భాస్కర్ రెడ్డి తరఫు న్యాయవాదులు సీబీఐ న్యాయమూర్తిని కోరారు. అయితే ఈ విషయాన్ని పరిశీలిస్తామని న్యాయమూర్తి అన్నారు. అయితే సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డి కస్టడీ కోరుతూ పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. దీనిపై రేపు నిర్ణయిస్తామని కోర్టు తెలిపింది. దీంతో భాస్కర్ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలిస్తున్నారు.   


రేపు కస్టడీ కోరే అవకాశం 


వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు భాస్కర్ రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ కు ఆదేశించారు.  వివేకా హత్య కేసులో ఏ-7 నిందితుడిగా వైఎస్ భాస్కర్ రెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. భాస్కర్ రెడ్డి మెడికల్ రిపోర్టు, రిమాండ్ రిపోర్టును సీబీఐ అధికారులు న్యాయమూర్తికి సమర్పించారు. రిపోర్టుల పరిశీలన తర్వాత భాస్కర్ రెడ్డికి రిమాండ్ విధించారు సీబీఐ న్యాయమూర్తి. రేపు నాంపల్లి సీబీఐ కోర్టులో భాస్కర్ రెడ్డిని సీబీఐ కస్టడీకి కోరే అవకాశం ఉంది.


బీపీ లెవల్స్ హై
 
అంతకు ముందు భాస్కర్ రెడ్డికి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల సమయంలో వైఎస్ భాస్కర్ రెడ్డికి ఒక్కసారిగా బీపీ లెవల్స్ పెరిగాయి. బీపీ పెరగడంతో ఈసీజీ 2 D ECHO పరీక్షలు చేశారు వైద్యులు. వైద్య పరీక్షలు తర్వాత భాస్కర్ రెడ్డిని సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు అధికారులు.  ఆదివారం ఉదయం పులివెందులలో వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు ఆయన నివాసంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబసభ్యులకు మెమో అందజేసి 120బి రెడ్‌విత్‌ 302, 201 సెక్షన్ల కింద భాస్కర్ రెడ్డిని అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆయనను హైదరాబాద్‌కు తరలించి వైద్య పరీక్షల నిర్వహించిన అనంతరం సీబీఐ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. 


సీబీఐ అధికారుల తీరు సరిగ్గా లేదు- ఎంపీ అవినాష్ రెడ్డి


 మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్టుపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. సీబీఐ అధికారుల విచారణ తీరు సరిగ్గా లేదంటూ వైఎస్సార్ సీపీ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థంపర్థం లేని విషయాలను సీబీఐ పెద్దదిగా చూస్తూ.. ఈ స్థాయికి దిగజారడం విచారకరమని వ్యాఖ్యానించారు.  అధికారుల తీరు గురించి సీబీఐ పెద్దలకు కూడా తెలియజేశామన్నారు. పాత అధికారులు చేసిన తప్పులను కొత్త అధికారులు కొనసాగిస్తున్నారని అన్నారు. తాము లేవనెత్తిన కీలక అంశాలపై వారు స్పందించడం లేదని.. వివేకా స్వయంగా రాసిన లేఖను కూడా పట్టించుకోవడం లేదని వివరించారు. ఆయన చనిపోయినప్పుడు తానే స్వయంగా పోలీసులకు సమాచారం ఇచ్చానని.. హత్య గురించి ముందుగా తెలిసింది వివేకా అల్లుడికే అని కీలక వ్యాఖ్యలు చేశారు. తన కంటే గంట ముందుగానే విషయం తెలిసినా ఆయన అల్లుడు పోలీసులకు ఈ విషయం చెప్పలేదని అన్నారు.