Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణ ఘటన జరిగింది. చిన్న కారణంతో అన్నదమ్ముల మధ్య మొదలైన గొడవ... అన్న ప్రాణం తీసింది. ఇంటి అద్దె విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. గొడవ పెరిగి ఇరువురు పరస్పరం దాడి చేసుకున్నారు. కూరగాయలు కోసే కత్తితో అన్నపై తమ్ముడు దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అన్న మృతిచెందాడు.
అసలేం జరిగింది?
హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో అసోం రాష్ట్రానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఇంటి అద్దె చెల్లించే విషయంలో అన్న అంజన్ బోరాకి తమ్ముడు రంజన్ బోరాకి మధ్య శనివారం వాగ్వాదం జరిగింది. ఈ గొడవ కాస్త పెద్దది అయి ఇరువురు దాడి చేసుకున్నారు. తమ్ముడిపై అన్న చపాతీ కర్రతో దాడి చేయగా, ఆవేశానికి లోనైన తమ్ముడు రంజన్ అన్నని కూరగాయల కత్తితో పొడిచాడు. దీంతో అన్న అంజన్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు తమ్ముడిని అదుపులోకి తీసుకున్నారు. అన్న అంజన్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
భార్యాబిడ్డలపై కత్తితో దాడి
35 ఏళ్ల క్రితం వారిద్దరికీ పెళ్లి జరిగింది. వారి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా 30 ఏళ్ల క్రితం ఓ పాప కూడా పుట్టింది. అయితే ఇన్నాళ్లూ హాయిగా సాగిన వీరి కాపురంలో అనుమానం అనే భూతం ఎంటర్ అయింది. చాలా సంతోషంగా ఉన్న కుటుంబాన్ని ముక్కలు చేసింది. ఇంతకాలం భార్య, కూతురును ఎంతో ప్రేమగా చూసుకున్న తండ్రికి.. ఈ మధ్య ఆలిపై అనుమానం మొదలైంది. ఈ క్రమంలోనే తరచుగా భార్యతో గొడవపడుతున్నాడు. ఇష్టం వచ్చినట్లుగా దూషిస్తున్నాడు. కోపం పట్టలేని అతడు భార్యపై కత్తితో దాడి చేశాడు. అడ్డం వచ్చిన కూతురిపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో కూతురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. భార్య ప్రస్తుతం కొన ఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
అసలేం జరిగిందంటే..?
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలోని చొట్టవాని పేటలో కసాయి భర్త కొల్లి రామారావు తన భార్య కొల్లి సూర్యం పై అనుమానంతో వేధించాడు. ఈనేపథ్యంలో భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన కొల్లి రామారావు.. 55 ఏళ్ల వయసున్న తన భార్య సూర్యం, 30 ఏళ్ల వయసు ఉన్న కూతరు విజయపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఇష్టం వచ్చినట్లుగా నరకడంతో కూతురు విజయ అక్కడికక్కడే చనిపోయింది. భార్య మాత్రం కొన ఊపిరితో రక్తపమడుగులో పడి ఉంది. అయితే విషయం గుర్తించిన స్థానికులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో కొల్లి రామారావు పరారయ్యాడు. వెంటనే స్థానికులంతా కలిసి పోలీసులకు సమాచారం అందించారు. కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న సూర్యంను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంనది వైద్యులు చెబుతున్నారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు విజయ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. పారిపోయిన నిందితుడు కొల్లి రామారావు గురించి గాలింపు చర్యలు చేపట్టారు.