CBI Notice To Avinash Reddy ;    వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24వ తేదీన హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. ఈ నోటీసుల్ని వాట్సాప్‌లో పంపారు. మధ్యాహ్నం మూడు గంటలకు హాజరు కావాలని నోటీసుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. గత నెల 28న అవినాష్ రెడ్డిని తొలి సారిగా ప్రశ్నించారు. ఆ సమయంలో ఆయన కాల్ లిస్ట్ కు సంబంధించిన ప్రశ్నలు వేశారు. ఆయన ఇచ్చినసమాధానంతో  ఏపీ సీఎం జగన్ పీఏ కృష్ణమోహన్ రెడ్డి, భారతి పీఏ నవీన్ లను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఆ తర్వాత అవినాష్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేయడం సంచలనాత్మకంగా మారింది.


గత నెల 28న మొదటి సారి సీబీఐ విచారణకు హజరైన అవినాష్  ! 


గత నెల 28న అవినాష్ రెడ్డిని నాలుగున్నర గంటల పాటు సీబీఐ అధికారులు  ప్రశ్నించారు.  సీబీఐ ప్రశ్నలకు సమాధానం చెప్పాన‌ని తెలిపారు. సీబీఐ అధికారులు.. అవసరమైతే మరోసారి పిలుస్తామని అన్న‌ట్లు అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. దర్యాప్తు అంశాలను ఇప్పుడు బహిర్గతం చేయలేనని అవినాష్ రెడ్డి అన్నారు. విచారణ పారదర్శకంగా జరగాలని సీబీఐని కోరిన‌ట్లు అవినాష్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఆయననను మరోసారి సీబీఐ పిలిచింది. నిజానికి జనవరిలో   24నే మొదటి సారి విచారణకు రావాలని 23న సీబీఐ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా ఐదు రోజుల తర్వాత విచారణకు రాగలనని ఎంపీ బదులిచ్చారు. ఆ ప్రకారం రెండో సారి నోటీసులకు రెస్పాండ్ అయ్యారు. 


మీడియాలో వ్యతిరేక ప్రచారం చేస్తున్నరని అవినాష్ రెడ్డి ఆరోపణ 


వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రారంభమైన దగ్గరనుంచి తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని తెలిపిన అవినాష్ రెడ్డి.. పనిగట్టుకుని ఓ వర్గం మీడియా లేనిపోని కథనాలను ప్రసారం చేస్తోందన్ని ఆరోపిస్తున్నారు.  తప్పుదోవపట్టించేలా వార్తలను ప్రసారంచేస్తున్నారని  విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నట్టుగా  అందుకు తన న్యాయవాదిని అనుమతించాలని కోరారు.  ఆడియో, వీడియో రికార్డింగుకు అనుమతించాలని.. తనతో పాటు ఒక న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలని, తన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. దీనిపై సీబీఐ అధికారుల స్పదించలేదు. ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. 


తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అవినాష్ రెడ్డి ఆరోపణ


ఈ కేసుపై గతంలో స్పందించిన అవినాష్ రెడ్డి ..తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ారోపించారు.  నిజం తేలాలని తాను కూడా భగవంతుడుని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆరోపణలు చేసేవారు.. ఇలాంటి ఆరోపణ చేస్తే వాళ్ల కుటుంబాలు కూడా ఎలా ఫీల్ అవుతారో ఒకసారి ఊహించుకోవాలన్నారు ఎంపీ.ఈ కేసులో ఎక్కువగా అవినాష్ రెడ్డి పేరే ప్రధానంగా ప్రస్తావనకు వస్తూండటం.. రెండో సారి విచారణకు పిలవడంతో.. వైఎస్ఆర్‌సీపీ వర్గాల్లో ఉత్కంఠ ఏర్పడింది. 


వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులను కడప నుంచి చంచల్ గూడ జైలుకు తరలించారు. ఏ వన్ నిందితునిగా ఉన్న గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగాల్సి  ఉంది. సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతోంది.