Ganja Seized in Mangalagiri: ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుండటంతో పోలీసులు పలుచోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.  ఇందులో భాగంగా శనివారం మంగళగిరి ఖాజీ టోల్‌గేట్‌ వద్ద ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. రెండు కార్లలో అనుమానం ఉన్న వ్యక్తులను గమనించి  సోదాలు నిర్వహించగా అందులో ఉన్న 230 కిలోల గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


కారులో ఉన్న అమీర్‌, అబ్దుల్లా ఫారుఖ్‌, కార్తికేయన్‌, మల్లికార్జున్‌, కాలేయ్‌ మృధన్ అనే ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.34 వేల నగదు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు పోలీసులు వెల్లడించారు. వీరు విశాఖ నుంచి తమిళనాడుకి రెండు కార్లలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రెండు వాహనాల్ని పోలీసులు సీజ్‌ చేశారు. వీరంతా తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు చెందిన  వ్యక్తులు.  గత కొంతకాలంగా విశాఖ నుంచి గంజాయి తీసుకొస్తున్నట్లు సెబ్ అధికారులు తెలిపారు. శనివారం తమకు గంజాయి తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో దాడులు నిర్వహించినట్టు చెప్పారు.


గంజాయి విక్రమ ముఠా అరెస్ట్
 రెండ్రోజుల క్రితమే గంజాయి విక్రయిస్తున్న ముఠాను చేబ్రోలు పోలీసులు అరెస్టు చేశారు. చేబ్రోలుకు చెందిన కూలీ కట్టా శ్రీను అలియాస్ దబ్బల శ్రీను, వట్టిచెరుకూరు మండలం కోవెలమూడికి చెందిన ఆటోడ్రైవర్ తోట రాజేష్, గుంటూరు నల్లచెరువుకు చెందిన మరో ఇద్దరు మైనర్లు చెడు స్నేహాలతో గంజాయికి అలవాటుపడ్డారు. ఆ తర్వాత సులువుగా డబ్బు సంపాదించేందుకు గంజాయి అమ్మడం మొదలుపెట్టారు. బైకులను దొంగిలించి వచ్చిన కాడకి అమ్మేసేవారు.  ఆ డబ్బుతో విశాఖపట్నం, అరకు ప్రాంతాలకు వెళ్లి గంజాయిని కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చి చేబ్రోలు, పొన్నూరు ప్రాంతాల్లోని కళాశాలల్లో విద్యార్థులకు, స్పిన్నింగ్ మిల్లుల్లోని కార్మికులకు విక్రయిస్తున్నారు.


ఈ విషయం పసిగట్టిన  గంజాయి విక్రయాలపై నిఘా పెట్టారు. ఈ ముఠాలోని సభ్యులు గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నారనే సమాచారంతో మంగళవారం చేబ్రోలు నందమూరి కాలనీలోని కట్టా శ్రీను నివాసానికి పోలీసులు వెళ్లి తనిఖీ చేశారు. ఇంట్లో దాచిపెట్టిన 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, శ్రీను, తోట రాజేష్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు.  ఈ ముఠాతో సంబంధం ఉన్న మరో నలుగురి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు.  



ఏపీ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు కసరత్తు..
 ఏపీ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ (ఏపీఎన్టీఎఫ్) యూనిట్ ఏర్పాటుకు కసరత్తు మొదలైంది.. డ్రగ్స్, గంజాయి నివారణ చర్యలను మిషన్ ఆఫ్ ద ఏపీ అని పేర్కొంటోంది ఏపీ సర్కార్.. ఏడీజీ లేదా ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఏపీఎన్టీఎఫ్ ఏర్పాటు కానుంది. రాజధానిలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్.. 26 జిల్లాల్లో నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ ఏర్పాటుకు సిద్ధమవుతుంది కూటమి ప్రభుత్వం. వివిధ శాఖల నుంచి అవసరమైన సమాచారం తీసుకునే అధికారం ఏపీఎన్టీఎఫ్ కు కట్టబెట్టాలనే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.. కేసులను నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు ఏపీఎన్టీఎఫ్ కి ప్రభుత్వం కీలక అధికారాలు ఇవ్వనుంది. ఏపీఎన్టీఎఫ్ విభాగానికి మొత్తం 724 మంది ప్రభుత్వ, 110 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉండేలా ప్రతిపాదనలు ఉన్నాయి. ఇది డ్రగ్స్ మరియు గంజాయితో పాటు నివారణ చర్యలను చేపట్టింది.