Murder Case: వివాహేతర సంబంధాలు నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. గతంలో ఈ వివాదాల్లో చిక్కి మహిళలు ఆత్మహత్యలు చేసుకోవడమో, హత్యకు గురవ్వడంతో  జరగ్గా...ఇప్పుడు  మగవారే బలవుతున్నారు. నెలరోజుల క్రితం యూసప్ గూడలో రియాల్టర్ రామన్నను హానీట్రాప్ చేసి మహిళ హత్య చేయించగా...మళ్లీ అదే తరహాలో ఉప్పల్ లో ఓ మర్డర్ చోటుచేసుకుంది.  ఓ మహిళ వలకు చిక్కిన వ్యాపారి ప్రాణాలు వదులుకున్నాడు.
కళ్లలో కారం చల్లి హత్య 
హైదరాబాద్(HYD) లోని ఉప్పల్ (Uppal)లో దారుణ హత్య చోటుచేసుకుంది. కళ్లల్లో కారం చల్లి కత్తులతో పొడిచి పాత కార్లు కొని విక్రయించే వ్యాపారిని దారుణంగా హతమార్చారు. సికింద్రాబాద్(Secandrabad) కు చెందిన  పుస్తకాల సాయికుమార్‌ సెకండ్‌హ్యాండ్‌ కార్ల వ్యాపారం చేస్తుంటాడు. గతంలో ఆయన  చిలుకానగర్‌ డివిజన్‌లోని ఆదర్శనగర్‌లో ఉండేవారు. అక్కడే పాత కార్లు కొని అమ్మడం చేస్తుండేవాడు. అక్కడ ఉన్నప్పుడే  స్థానిక మహిళతో సాయికుమార్ కు వివాహేతర సంబంధం ఉంది. కొంతకాలం వరకు సాఫీగా సాగినా ఆ తర్వాత విబేధాలు రావడంతో ఆమె సాయికుమార్(Saikumar) ను దూరం పెడుతూ వచ్చింది. అయినా సాయికుమార్ ఆ మహిళను వేధించడం ఆపకపోవడంతో గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే సాయి ఆదర్శనగర్ వీడి ఉప్పల్(Uppal) వచ్చి సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నాడు.
హానీట్రాప్ తో హత్య
సాయికుమార్ ఉప్పల్ వచ్చిన ఆదర్శనగర్ కు చెందిన మహిళను వేధించడం మానుకోలేదు. ఆమె ఎంత దూరం పెడుతున్నా....పదేపదే ఫోన్లు చేసి విసిగించడంతో  సాయికుమార్ అడ్డు తొలగించుకోవాలని ఆమె పథకం వేసింది. కుమార్తెతో కలిసి సాయికుమార్ కు ఫోన్ చేసి(Honey Trap) వెలుగుగుట్ట ప్రాంతానికి రప్పించింది. అప్పటికే అక్కడ మాటు వేసిన ఉన్న యువకులు సాయికుమార్ కళ్లలో కారం చల్లి కత్తులతో పొడిచి హత్య (Murder)చేశారు.  తీవ్రంగా గాయపడిన సాయికుమార్ ను స్థానికులు గమనించి  గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ  సాయికుమార్ ప్రాణాలు విడిచాడు. హత్యలో తల్లీకూతుళ్లు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. 
వరుస ఘటనలు
ఇటువంటి హత్య ఘటనలు ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయాయి. ఇటీవల జూబ్లీహిల్స్(Jublihills) లో ని యూసఫ గూడలో జరిగిన హత్య కేసులోనూ  తల్లీకూతుళ్లు  రియాల్టర్  సింగోటం రామును హానీట్రాప్ లో దించి హత్య చేశారు. రాముతో పాతకక్షలు ఉన్న మణికంఠతో కలిసి పథకం ప్రకారం తల్లీకూతుళ్లు హతమార్చారు. లౌక్యంగా ఫోన్ లో మాట్లాడి నమ్మించి నిర్మానుష్య ప్రదేశాలకు రప్పించి మహిళల హత్యలకు పాల్పడుతుండటం కలకలం రేపుతోంది. ఈ రెండు ఘటనల్లోనూ తల్లీ కుమార్తెలిద్దరూ  పాల్గొనడం విశేషం. హైదరాబాద్ నగరంలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మాయలేడిల వలలో పడొద్దని సూచిస్తున్నారు. ఎవరైనా కిలేడీలు బెదిరింపులకు పాల్పడుతుంటే స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాల్సిందిగా ఆదేశించారు. ఇలాంటి ఘటనలతో సంబంధం ఉన్న పాత కేసులపై నిఘా ఉంచాలని పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించారు. మాయమాటలు చెప్పి ముగ్గులోకి దించే మహిళలతో జాగ్రత్తగా ఉండాలని..అనుమానస్పదంగా ఉంటే ఏకాంత ప్రదేశాలకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం వెతుకుతున్నారు. మహిళలతో పాటు  హత్యలో పాల్గొన్న మరో ఇద్దరి జాడ కోసం ఆరా తీస్తున్నారు.