Hindupuram News : తాను ఆత్మహత్యకు పాల్పడడానికి కారణం హిందూపురం ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, చిలమత్తూరు వైసీపీ నాయకుడు నాగరాజు యాదవ్ కారణమని వైసీపీ అసమ్మతి వర్గానికి చెందిన చౌడప్ప అనే వ్యక్తి గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చౌడప్ప తన  పొలంలో కూర్చుని సెల్ఫీ వీడియోలో ఆత్మహత్యాయత్నానికి కారణాలను చెబుతూ పురుగుమందు తాగాడు. ఈ సెల్ఫీ వీడియో గ్రూపులో పోస్ట్ చేయడంతో దుమారం నెలకొంది. తాను వైసీపీ కార్యకర్తగా, స్టోర్ డీలర్ గా కొనసాగుతున్నానని, వైసీపీ అసమ్మతి  వర్గంతో సన్నిహితంగా ఉన్నానంటూ తనపై ఎమ్మెల్సీ ఇక్బాల్, నాగరాజు యాదవులు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించారని ఆరోపించారు. దీంతో తనను ఎస్ఐ శ్రీనివాసులు స్టేషన్ పిలిపించి తలకు గన్ పెట్టి బెదిరించారన్నారు. కుటుంబ సభ్యుల పట్ల అసభ్యంగా మాట్లాడారని ఆవేదన చెందారు. ఈ విషయంలో తాను తీవ్ర అవమానానికి గురయ్యానని సెల్ఫీ వీడియో తెలిపారు. 


ఎమ్మెల్సీ ప్రోద్బలంతో కేసులు 


దీంతో పాటు తనకు చెందిన భూమి వ్యవహారంలో  ఇద్దరు వ్యక్తులు తనను వేధించారని చౌడప్ప ఆరోపించారు. దానికి సంబంధించి ఎమ్మెల్సీ ఇక్బాల్, నాగరాజ్ యాదవుల ప్రోద్బలంతో హిందూపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు బెదిరించారని ఆవేదన చెందారు. దీంతో తనకు తన కుటుంబానికి తీవ్ర అవమానం జరిగిందన్నారు. భరించలేక క్రిమిసంహారక మందును సేవించి ఆత్మహత్యకు పాల్పడుతున్నానని తాగుతున్నానని ఒక సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అప్రమత్తమైన వైసీపీ నాయకులు, అతని కుటుంబ సభ్యులు వెంటనే అతడున్న చోటికి చేరుకుని చికిత్స కోసం చిలమత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.



ఎమ్మెల్యేపై ఆరోపణలు ఆపై ఆత్మహత్యాయత్నం


 వైసీపీ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన రేషన్ దుకాణాన్ని తొలగించారని.. కాళ్లు పట్టుకున్నా కనికరించలేదంటూ ఓ యువకుడు వీడియో విడదుల చేశాడు. అంతే కాకుండా ఎమ్మెల్యే తనపై ఎందుకంత కక్ష పెంచుకున్నారో కూడా తెలియట్లేదని, వైసీపీ ఎమ్మెల్యే, పోలీసుల వేధింపులే తన ఆత్మహత్యకు కారణం అని వివరించాడు. ఆపై ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం కడనూతలకు చెందిన పైడి శ్రీహర్ష కావలి ఎమ్మెల్యే ఇంటి సమీపాన ఆత్మహత్యా యత్నం చేశాడు. ఎమ్మెల్యే ఇంటికి సమీపంలో ఆత్మహత్య చేసుకుంటానంటూ మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. పాత్రికేయులు అక్కడికి వెళ్లే లోపు ద్విచక్ర వాహనంపై ఆర్డీఓ కార్యాలయం వద్దకు వెళ్లిపోయారు. అప్పటికే కొంత పురుగుల మందు తాగారు. ఆడ్టీఓ కార్యాలయం వద్ద మరికొంత తాగి కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన టీడీపీ నాయకులు, విలేకరులు ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి నెల్లూరు అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసే ముందు శ్రీహర్ష తన ఆవేదనను వీడియోలో చిత్రీకరించారు. తన ఆత్మహత్యకు ఎమ్మెల్యే, పోలీసులు, వైసీపీ నాయకుల వేధింపులే కారణం అని అందులో పేర్కొన్నారు. వారి వల్ల తన జీవనోపాధి పోయిందని వాపోయారు