Cameron Green News: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ గాయపడ్డాడు. అతని కుడిచేతి చూపుడు వేలికి గాయమైంది. గ్రీన్ గాయం చాలా తీవ్రమైనదని తెలుస్తోంది. దీనికి సర్జరీ కూడా అవసరం కానుంది. అతని వేలు ఫ్రాక్చర్ అయింది. భారత్‌తో జరగాల్సిన బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో అతను ఆడతాడా లేడా అన్నది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. అతని గాయం ఆస్ట్రేలియాకే కాకుండా ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌కు కూడా సమస్యలను సృష్టిస్తుంది. ఇటీవల జరిగిన మినీ వేలంలో ముంబై అతడిని రూ. 17.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌కు గ్రీన్ ఇప్పటికే దూరమయ్యాడు. వార్తల ప్రకారం కామెరాన్ గ్రీన్‌కు శస్త్రచికిత్స అవసరం అవుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గ్రీన్ గాయపడ్డాడు. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఎన్రిక్ నార్కియా బౌన్సర్‌ను ఆడటంతో తనకు గాయం అయింది. ఆ తర్వాత కూడా అతను మూడవ రోజు బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ చేశాడు.
బోర్డర్ గవాస్కర్ సిరీస్‌కు స్టార్క్ దూరం
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ తోపాటు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా గాయపడ్డాడు. తనకు ఎడమచేతి మధ్య వేలికి గాయమైంది. భారత్‌లో జరగనున్న బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో స్టార్క్‌కు గాయం కారణంగా జట్టులో చోటు దక్కడం లేదని చెబుతున్నారు. బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
దక్షిణాఫ్రికాతో మ్యాచ్ తర్వాత, స్టార్క్ తన గాయం గురించి మాట్లాడుతూ, “భారతదేశంలో పెద్ద టూర్ ఉంది. అందులో ఆడతానో లేదో తెలీదు. ఇది నేను బౌలింగ్ వేసే చేయి కాబట్టి నేను మరింత జాగ్రత్తగా ఉండాలి. అది బాగా నయమయ్యేలా చూసుకోవాలి." అన్నాడు.