Hindupur Crime : వివాహితను ప్రేమించానని వెంటపడ్డాడు ఓ వ్యక్తి. ఆమె ఒప్పుకోకపోవడంతో వివాహిత ఇన్స్టాగ్రామ్ నుంచి ఫొటోలను డౌన్లోడ్ చేసుకొని మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. చేసేది లేక అతడికి లొంగిపోయిన వివాహిత చివరికి అతని చేతిలోనే ప్రాణాలను కోల్పోయింది. ఈ ఘటన శ్రీ సత్య సాయి జిల్లాలో చోటుచేసుకుంది.
అసలేం జరిగింది?
తెలంగాణలోని వరంగల్ కు చెందిన అక్షిత కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ వైద్య కళాశాలలో పీజీ విద్యను అభ్యసిస్తుంది. వరంగల్ నుంచి కర్ణాటక చిక్బల్లాపూర్ వచ్చి వెళ్లే సందర్భంలో మెదక్ కు చెందిన మహేష్ వర్మకు అక్షిత కంటపడింది. అప్పటి నుంచి ఆమెను ప్రేమించాలంటూ మహేష్ వర్మ వెంటపడ్డాడు. అయితే అప్పటికే వివాహం అయిందని అక్షిత మహేష్ వర్మకు చెప్పింది. అయితే మహేష్ వర్మ అక్షితను వేధించడం మొదలుపెట్టాడు. అక్షిత ఇన్ స్టాగ్రామ్ నుంచి ఫొటోలను డౌన్లోడ్ చేసి మార్ఫింగ్ చేసి వేధింపులకు గురిచేసేవాడని పోలీసుల విచారణలో తేలింది.
హిందూపురం లాడ్జిలో విగతజీవిగా
మహేష్ వర్మ వేధింపులకు లొంగిపోయిన అక్షిత సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని జీఆర్ లాడ్జిలో విగతజీవిగా కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న టూ టౌన్ సీఐ వెంకటేశ్వర్లు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహేష్ వర్మ వేధింపులపై ఆరా తీశారు. మహేష్ వర్మ అక్షితను హత్య చేసి పరారయ్యాడని ఆమె సోదరుడు ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశాడు. హిందూపురం టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని యువతి మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
ఫ్రెండ్ భార్యతో వివాహేతర సంబంధం
ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలం పెద్దగోపతి గ్రామానికి చెందిన ఓ యువతికి 2010లో ఆమె సొంత మేనమామతో వివాహం జరిగింది. వీరిద్దరికీ మనస్పర్థలు రావడంతో 2015లో విడాకులు తీసుకొని, విడిగా ఉంటున్నారు. రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ ఆమెకు ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామానికి చెందిన యువకుడు సాయిచరణ్ అనే 28 ఏళ్ల వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఖమ్మంలో కాపురం పెట్టారు. ఈ యువకుడు కోడి పెంట, చికెన్ వ్యర్థాలను తరలించే ఓ లారీకి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇలా ఉండగా, ఇతనికి ఖమ్మంకు చెందిన ఓ ఆటో డ్రైవర్ కరుణాకర్ తో పరిచయం ఏర్పడి, అది స్నేహంగా మారింది. ఆ కరుణాకర్ తరచూ యువకుడి ఇంటికి వెళుతూ ఉండేవాడు. అలా అతడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్య తన స్నేహితుడైన ఆటో డ్రైవర్‌తో ఫోన్‌లో మాట్లాడుతుండటాన్ని చూసిన ఆ యువకుడు సాయి, ఆమెను కొన్నిసార్లు హెచ్చరించాడు.
పరువుపోతుందని మర్డర్ ప్లాన్
అయితే, భర్తకు ఈ విషయం తెలిసిపోయిందని, అతని ద్వారా ఇంకొంత మందికి ఈ విషయం తెలిస్తే పరువు పోతుందని భావించిన ఆమె హత్యకు కుట్ర పన్నింది. అలా ఈ నెల 1న యువకుడు, ఆటో డ్రైవర్ కలిసి వాహనంలో కోళ్ల పెంట, చికెన్ వ్యర్థాలను తీసుకొని ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు బయలుదేరాడు. మార్గం మధ్యలో ఖమ్మంలోని శ్రీనివాసనగర్ వద్ద మద్యం తీసుకుని ప్రకాశ్ నగర్ ప్రాంతంలో ఎవ్వరులేని చోటుకు వెళ్లి ఇద్దరూ మద్యం తాగారు. ఈ క్రమంలో గొడవ పడ్డారు. కోపంతో ఊగిపోయిన వివాహిత ప్రియుడు, ఆ యువకుడు సాయిని పారతో గట్టిగా కొట్టాడు. మృతదేహాన్ని వాహనంలోని కోళ్ల పెంట మధ్య దాచేశాడు.
చేపల చెరువులో మృతదేహం
తర్వాత నేరుగా వాహనంతో ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కుదుప గ్రామంలోని ఓ చేపల చెరువులో మృత దేహాన్ని పడేశారు. ఆ చేపల చెరువు యజమానికి ఈ నెల 4న చెరువులో మృతదేహం తేలుతూ కనిపించింది. గుర్తు పట్టిన ఆ యజమాని, మృతుడి స్నేహితుడైన నిందితుడికే ఫోన్ చేసి విషయం చెప్పాడు. అయితే విషయం బయటపడితే చెరువులోని చేపలను ఎవ్వరూ కొనరని, అందుకే గప్‌చుప్ గా ఉండాలని యజమానికి చెప్పాడు. దీంతో ఆ యజమాని, మృతదేహాన్ని పక్కనే ఉన్న చెరువు మధ్యలోకి తీసుకెళ్లి ముళ్ల కంప చెట్టు వద్ద వదిలేశాడు. అది వరదకు కొట్టుకుపోయింది. ఈ హత్యోదంతం గురించి తెలిసినా కూడా ఆ వివాహిత ఏమీ తెలియనట్లు తన భర్త కనిపించడం లేదంటూ ఈ నెల 11న ఖమ్మం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అనుమానంతో పోలీసులు ఆమెను, ఆమె ప్రియుడిని ప్రశ్నించడంతో అసలు నిజం బయటికి వచ్చింది. ఈ ఘటనలో ఇంకా ఎంతమంది ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహం కోసం వెతుకుతున్నామని పోలీసులు చెప్పారు.
Also Read : భర్త ఫ్రెండుతో భార్య శారీరక సంబంధం, పరువు పోతుందని పాడు పని!