దేశ స్వాతంత్ర్య సమరాన్ని ఒక మగ్గం మార్చేసిందని, అలాంటి చేనేత కార్మికులను ఆదుకొనేందుకు గతంలో ఏ ప్రభుత్వం వారికి అండగా నిలవలేదని అన్నారు. తాను 3 వేల కిలో మీటర్లకు పైగా చేసిన పాదయాత్రలో నేతన్నల జీవితాలను గమనించానని అన్నారు. వారికి తాను ఉన్నాననే భరోసా కల్పించేందుకు అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం అమల్లోకి తెచ్చామని వివరించారు. మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు సాయాన్ని గత మూడేళ్ల నుంచి ఇస్తున్నామని చెప్పారు. ఇప్పుడు నాలుగో ఏడాది కూడా రూ.24 వేలను బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు చెప్పారు. ఇలా నాలుగేళ్లలో ప్రతి కుటుంబానికి రూ.96 వేల సాయం చేస్తున్నట్లుగా చెప్పారు. గురువారం క్రిష్ణా జిల్లా పెడన వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ నేతన్న నేస్తం నాలుగో విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడారు. 


ఈ వేదికపై నుంచి 80,546 మంది నేతన్నలకు రూ.193.31 కోట్లను సీఎం జమ చేశారు. దీంతో ఇప్పటివరకూ నేతన్నల సంక్షేమం కోసం రూ.2,049 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక నేతన్నల ఆదాయం మూడు రెట్లు పెరిగిందని జగన్ అన్నారు. ఫ్లిప్ కార్ట్, ఆమెజాన్, మింత్రా వంటి ఈ-కామర్స్‌ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, చేనేత వస్త్రాలను ఆప్కో ద్వారా మార్కెటింగ్‌ చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒకే వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారని.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేసిన ప్రభుత్వం తమదేనని అన్నారు. 


కేబినెట్‌లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారని, మూడేళ్లలో నలుగురు బీసీలను రాజ్యసభకు పంపామని వివరించారు. శాసన మండలి సీట్లను బడుగు, బలహీన వర్గాలకే ఇచ్చామని చెప్పారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటు చేశామని సీఎం జగన్‌ తెలిపారు. ఇప్పటివరకు నేతన్నల సంక్షేమం కోసం రూ.2,049 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, గతంలో ఏ ప్రభుత్వం ఇంతలా సాయం అందించలేదని సీఎం జగన్‌ చెప్పుకొచ్చారు.


చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మీడియా సంస్థలు, దత్తపుత్రుడి కోసమే పని చేశారని అన్నారు. అప్పుడు రాష్ట్రంలో దోచుకో, తినుకో, పంచుకో పథకం నడిచిందని ఎద్దేవా చేశారు. తప్పుడు విమర్శలు  చేయడమే ఇప్పుడు వాళ్లు పనిగా పెట్టుకున్నారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మంచిని చూసి ఓర్చుకోలేకపోతున్నారని ఆవేదన చెందారు.


అంతకుముందు పెడన వేదిక వద్దకు చేరుకున్న సీఎం జగన్‌కు పర్యాటక మంత్రి, కృష్ణా జిల్లా ఇన్‌చార్జి మంత్రి అయిన ఆర్కే రోజా పుష్ఫగుచ్ఛం ఇచ్చి సాదర స్వాగతం పలికారు. పెడన వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించారు. స్థానిక నేతలతో సీఎం జగన్‌ ఆప్యాయంగా పలకరించారు. అక్కడ ఏర్పాటు చేసిన హస్తకళాకారుల ప్రదర్శనలను వీక్షించారు. పెడనలో వైఎస్సార్ నేతన్న నేస్తం కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వేదికపైకి చేరుకొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.