ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ తర్వాత కేంద్రం ప్రభుత్వం ఏపీ సమస్యల పరిష్కారంపై సమాయత్తం అయింది. రాష్ట్రంలో ఉన్న సమస్యలు తీర్చేందుకు ప్రత్యేక కమిటీని నియమించింది. అంతే కాందోడయ్ ఈరోజు(గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు ఈ ప్రత్యేక కమిటీ భేటీ కాబోతుంది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ అధ్యక్షతను ఈ సమావేశం జరగనుంది. అలాగే ఏపీ సర్కారు తరఫున ప్రతినిధుల బృందంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వైఎస్సార్ నేత విజయ సాయి రెడ్డి, ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్.ఎస్ రావత్ తో పాటు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపాల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్, మరికొందరు ఉన్నతాధికారులు ఉన్నారు.
పోలవరం ప్రాజెక్టు అంశమే ప్రధానంశం..!
అయితే ఈరోజు(గురువారం) జరగబోయే ఈ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలు, సమస్యలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులకు సంబంధించి పూర్తి వివరాలను సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఆంధ్ర ప్రదేశ్ భవన్ లో అధికారులు, నేతలు సమావేశం అయ్యారు. అయితే ఈ భేటీలోనే కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం పొందాల్సిన పలు ప్రాజెక్టులు, వివిధ శాఖల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిల గురించి సమగ్ర నివేదిక సిద్ధం చేస్కున్నట్లు తెలిసింది. ఇందులో పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ఆమోదం ప్రధానాంశం కానుంది.
ఖర్చు పెట్టిన తర్వాత సొమ్ము చెల్లించడమే జాప్యానికి కారణం..
టెక్నికల్ అడ్వైజర్ కమిటీ నిర్ధారించిన ప్రాజెక్టు వ్యయం రూ. 55, 548.87 కోట్లకు ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి తాజా ఢిల్లీ పర్యటనలో ప్రధానిని కోరారు. అలాగే ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్ల వారీగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన సొమ్మును తిరిగి చెల్లించే విధానానికి స్వస్తి చెప్పాలని, ఇది పనుల్లో జాప్యానికి కారణం అవుతోందని వెల్లడించారు. అన్ని జాతీయ ప్రాజెక్టుల్లో వ్యవహరించినట్లుగానే మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని ఆ మేరకు చేస్తున్న పనులకు వెంటనే రియంబర్స్ చేసేలా చర్యలు తీస్కోవాలని కోరారు.
రిసోర్స్ గ్యాప్ కింద రావాల్సిన నిధులపై చర్చ
ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2900 కోట్లు తక్షణమే విడుదల చేయాలని ఏపీ ప్రతినిధుల బృందం కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిసింది. రీసోర్స్ గ్యాప్ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.32,625.25 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖను కోరే అవకాశం ఉంది. వీటితో పాటే వేర్వేరు శాఖల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బకాయిలు, కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వైద్య కళాశాలల నిర్మాణానికి ఆర్థిక సాయం, వేర్వేరు ప్రాజెక్టులకు నిధుల మంజూరు అంశాలను గురించి చర్చించే అవకాశం ఎక్కువగా ఉంది.