Hanamkonda News: హనుమకొండలో ఓ ప్రేమోన్మాది తనను ప్రేమించలేదని విద్యార్థిని గొంతు కోశాడు. ప్రేమించాలని బలవంతం చేస్తూ కత్తితో దాడి చేశాడు. ఇంట్లోకి చొరబడి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో స్థానికులు యువతిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం యువతి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ముగ్గురు వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని.. 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతామని ఎంజీఎం వైద్యులు వెల్లడించారు. ఆమె కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంసీఏ చివరి సంవత్సరం చదువుతోంది. బాధితురాలు నర్సంపేట మండలం లక్నేపల్లికి చెందిన అనూషగా గుర్తించారు.


స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అనూషను కొంత కాలంగా అజహర్ అనే యువకడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అతని ప్రేమను అనూష ఒప్పుకోకపోవడంతో అతను కొంత కాలంగా ఆమెపై తీవ్ర అసహనంతో ఉన్నారు. దీంతోనే శుక్రవారం కత్తితో గొంతు కోశాడు. అనంతం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. యువతులను ప్రేమ పేరుతో వేధించే వారిని కఠినంగా శిక్షించాలని తోటి విద్యార్థులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


ఈ సంఘటనతో హన్మకొండలోని గాంధీనగర్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అమ్మాయి చాలా మంచిదని.. అసలు ఇంట్లో నుంచి బయటకు రాదని తెలిపారు. దాడికి ముందు యువకుడు కాలనీలో ద్విచక్రవాహనంపై తిరిగాడని స్థానికులు చెబుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్​ చేస్తున్నారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.