చుట్టూ ప్రతికూల పరిస్థితులు.. ఓ వైపు సాగరతీరం.. మరోవైపు తడి ఆరిపోయిన ఇసుక నేల.. అయినా ఓ యువకుడి వినూత్న ఆలోచన తలపండిన ఉద్యాన రైతులను సైతం తన వైపు తిప్పుకొనేలా చేసింది. సాదారణంగా మన ప్రాంతంలో పండే పుచ్చకాయలు పైన పచ్చ గాను లోన ఎరుపుగాను ఉంటాయి.. కానీ మీరు చూడబోయే ఈ యువ రైతు రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవ్వరు పండించని వివిధ జాతుల పుచ్చకాయలు ఎరుపుతో పాటు పసుపు, తెలుపు, కాయలు, తెలుపు వర్ణంతో అత్యధిక తీపినిచ్చే కర్భుజా పంట పండిస్తున్నాడు.. అంతేకాదు కాలిఫోర్నియా కర్భుజాను కూడా అంతర్ పంటగా కలిపి వేసి ప్రతికూల వాతావరణంలోనూ ప్రతిఫలం సాధించాడు.. ఈ రైతు వేసిన పంటలో పుచ్చకాయ ఎనిమిది కిలోలు, కర్బుజా నాలుగు కిలోలు పైనే ఉండడం మరో విశేషం.


కొనసీమ జిల్లాలోని మలికిపురం మండలంలో సముద్రతీర ప్రాంతమైన సఖినేటిపల్లి మండలం కేసనపల్లి గ్రామంలోని రామేశ్వరానికి చెందిన కౌలు రైతు దొమ్మేటి శ్రీనివాస్ వినూత్న పద్ధతిలో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎవ్వరు పండించని వివిధ జాతుల పుచ్చ, కర్బూజ పంటలను పండించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. గల్ఫ్ దేశంలో ఉపాధి నిమిత్తం డ్రైవర్ గా పని చేసిన శ్రీనివాస్ రెండేళ్ల క్రితం గల్ఫ్ నుంచి స్వగ్రామం వచ్చి ఈ వినూత్న సాగుపై శ్రద్ధ పెట్టాడు. ఈ క్రమంలో కేసనపల్లికి చెందిన యర్రంశెట్టి సుబ్బారావు, కృష్ణలకు చెందిన ఓ ఎకరం భూమి కౌలుకు తీసుకుని గతేడాది పుచ్చ, గుమ్మడి సాగు వేశాడు. అయితే మొదటి ప్రయత్నంలో నష్టాలపాలయ్యాడు. అయినా వెనుకడుగు వేయలేదు. ఈసారి వినూత్నంగా సాగు పద్ధతులతో తైవాన్, కాలిఫోర్నియా రకాలకు చెందిన పుచ్చకాయ, కర్భుజా విత్తనాలను తీసుకొచ్చి బిందు సేద్యంతో రెండెకరాలలో పంట వేశాడు.


సేంద్రియ పద్ధతుల్లో మల్చింగ్ చేసి అధిక దిగుబడులు సాధించాడు. ఎకరాకు రూ.60 వేలు ఖర్చు చేశానని దీనిపై ఎకరాకు రూ.1.60 లక్షలు ఆదాయం వచ్చిందని చెబుతున్నాడు. రోజు పుచ్చకాయలు 500, కర్బూజా 200 కాయలు కోతకు వస్తున్నాయని పొలం దగ్గరకే వ్యాపారులు, స్థానికులు వచ్చి కొనుగోలు చేస్తున్నారని శ్రీనివాస్ చెబుతున్నాడు. ఉద్యాన అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చేయూత అందిస్తే తీరంలో సాగు విస్తరించి రైతులు లాభాలు గడించవచ్చని చెబుతున్నాడు. వివిధ రంగుల పుచ్చకాయలు, కాలిఫోర్నియా కర్భుజా.. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవ్వరు పండించని వివిధ జాతుల పుచ్చకాయలు ఎరుపుతో పాటు పసుపు, తెలుపు, కాయలు, తెలుపు వర్ణంతో అత్యధిక తీపినిచ్చే కర్భుజా పంట పండిస్తున్నాడు.


భారీ సైజులో కాయలు
అతను పంటలో పుచ్చకాయ 8 కిలోలు, కర్బుజా 4 కిలోలు పైనే ఉండడం మరో విశేషం. యువ రైతు దొమ్మేటి శ్రీనివాస్ చేసిన ఈ ప్రయత్నానికి స్థానికంగా కూడా చాలామంది నిరుత్సాహ పరిచారు.. సముద్రతీరంలో ఇటువంటి పంటలు పండుతాయా అంటూ అనుమానాలను వ్యక్తం చేశారు.. అయినా ఏ మాత్రం నిరుత్సాహ పడకుండా దొమ్మేటి శ్రీనివాస్ చేసిన ప్రయత్నానికి పూర్తిస్థాయిలో ప్రతిఫలం దక్కడంతో గ్రామస్థులతో పాటు అనేకమంది శ్రీనివాస్ ను అభినందిస్తున్నారు. సముద్ర తీరంలో పూర్తిగా ప్రతికూల పరిస్థితులను అధిగమించి అనేక మంది రైతులకు ఆదర్శంగా నిలిచాడు శ్రీనివాస్.