Guntur Stampede Incident: గుంటూరు తొక్కిసలాట ఘటనలో ఉయ్యూరు శ్రీనివాస రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఆయనను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ప్రవాస భారతీయుడు ఉయ్యూరు శ్రీనివాస్ నేతృత్వంలోని ఉయ్యూరు ఫౌండేషన్ గుంటూరు సదాశివ నగర్ లోని వికాస్ హాస్టల్ మైదానంలో ఆదివారం చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు చనిపోయారు. మరికొందరు ఆసుపత్రిలో చేరారు. ఇంకొదరికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది.
కార్యక్రమానికి సరిపడా సెక్యూరిటీ ఇచ్చినప్పటికీ.. ప్రమాదం
గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నల్లపాడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు కాగా... ఇందులో ప్రధాన నిందితుడిగా ఉయ్యూరు శ్రీనివాస్‌ను పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయనను అరెస్ట్ చేశారు. క్యూలో జనాలను ఎక్కువ సమయం నిలబెట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. కార్యక్రమానికి సరిపడా సెక్యూరిటీ ఇచ్చామని వివరిణ ఇచ్చారు. ఫస్ట్ కౌంటర్ వద్దే ప్రమాదం జరిగిందని... తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముందుగానే హెచ్చరించినట్టు పేర్కొన్నారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా తానా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఉన్న శ్రీనివాస్ పలు కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికే ఆయన గుంటూరు సహా మూడు ప్రాంతాల్లో అన్న క్యాంటీన్‌లు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు జనతా వస్త్రాలు, సంక్రాంతి కానుకలు పంపిణీకి యత్నించారు. మొదటగా గుంటూరు వెస్ట్‌లో చీరలు, సరకుల పంపిణీ చేపట్టారు.
ముఖ్య అతిథిగా వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు
ఉయ్యూరు ఫౌండేషన్ తరఫున చేపట్టిన ఈ పంపిణీ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబును చీఫ్ గెస్ట్‌గా పిలిచారు. స్థానిక నాయకులను కూడా ఆయన ఆహ్వానించలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు ప్రసంగించి వెళ్లిన కాసేపటికే చీరల పంపిణీలో అపశ్రుతి జరిగిపోయింది. అనుకున్నదాని కంటే ఎక్కువ సంఖ్యలో మహిళలు రావడంతో నిర్వాహకులు అదుపు చేయలేకపోయారు. బారికేడ్ల పై నుంచి జనం తోసుకొని రావడంతో ఘోరం జరిగిపోయింది.
మృతుల కుటుంబాలకు 31 లక్షల చొప్పున నష్ట పరిహారం
ఘటన జరిగిన వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారికి పరిహారం కూడా ప్రభుత్వంతోపాటు తెలుగు దేశం పార్టీ, ఆ పార్టీ నాయకులు, చీరల పంపిణీ చేసిన ఉయ్యూరు శ్రీనివాస్ కూడా ప్రకటించారు. మృతి చెందిన వారికి కుటుంబానికి ఒక్కొక్కరికి 31 లక్షలు అందనుంది. ఇందులో తెలుగుదేశం ఐదు లక్షలు ఇవ్వనుంది. ప్రభుత్వం తరఫున 2 లక్షలు అందించనున్నారు. ఉయ్యూరు ఫౌండేషన్ తరఫున 20 లక్షలు సాయం ప్రకటించారు. ఇలా మొత్తంగా 31 లక్షల సాయం మృతుల కుటుంబాలకు అందనుంది. గాయపడిన వారికి యాభై వేలు ఇవ్వబోతున్నారు. మొన్న కందుకూరు, నిన్న గుంటూరులో తొక్కిసలాట జరగడం టీడీపీకి ఇబ్బందిగా మారింది. అన్ని పార్టీల నుంచి విమర్శల దాడి తీవ్రమైంది.