Guntur Ganja Cases : గుంటూరు జిల్లాలో గంజాయి కేసులు ప‌ట్టుకునేందుకు అటు లా అండ్ ఆర్డర్ పోలీసులు ఇటు స్పెష‌ల్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు  పోటీప‌డుతున్నారు. గుంటూరు జిల్లా పరిధిలో గంజాయి నిర్మూలనే లక్ష్యంగా లా అండ్ ఆర్డర్ , ఎస్ఈబీ పోలీసులు దూకుడుగా కేసులు న‌మోదు చేస్తున్నారు. గంజాయి విక్రయం, వినియోగదారులపై పటిష్ఠ నిఘా ఉంచి, అక్రమ కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండేందుకు  అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి సారించింది. రాజ‌కీయంగా ఈ విష‌యం ప్రభుత్వానికి ఇబ్బంది క‌రంగా మార‌టంతో  గంజాయిపై నిఘా పెంచారు పోలీసులు. గ‌డిచిన 50 రోజుల్లో అంటే (01.04.2022 నుంచి 23.05.2022 వరకు) లా అండ్ ఆర్డర్, SEB పోలీసులు విడి విడిగా గంజాయి, ద్రవ రూప గంజాయి, మత్తుపదార్థాల విక్రయం, వినియోగం, సరఫరా చేసే వారిపై వరుసగా దాడులు నిర్వహించారు. ఆ లెక్కల‌ను ఎస్పీ ఆరిఫ్ హ‌ఫీజ్ మీడియాకు రిలీజ్ చేశారు. 


లా అండ్ ఆర్డర్ పోలీసులు సీజ్ చేసిన గంజాయి


1. 11 కేసుల్లో 36.385 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని, 22 మందిపై కేసులు 


2. ఒక కేసులో 0.06 ml ద్రవ రూప గంజాయి స్వాధీనం చేసుకుని, ఒకరిపై కేసు 


3. MDMA మత్తుపదార్ధం విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసి, 17.1 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు. 


మ‌రో వైపు స్పెష‌ల్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కూడా గంజాయి స్మగ్లింగ్ పై దూకుడు పెంచారు. ఎస్ఈబీ పోలీసులు 7 కేసుల్లో 5.940 కేజీల గంజాయి, 4 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 11 మందిపై కేసులు నమోదు చేశారు. 


హైదరాబాద్ లో భారీగా గంజాయి సీజ్


హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టుపడింది. గంజాయి రవాణాకు కొత్త మార్గాలు అనుసరిస్తున్నారు స్మగర్లు.  మహిళలను స్మగ్లింగ్ దందా దింపిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మహిళలకు కమీషన్ ఆశ చూపి గంజాయిను తరలిస్తోంది ఓ గ్యాంగ్. విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి తరలిస్తున్న ముఠాను సోమవారం హయత్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 10 మంది స్మగ్లర్లను పట్టుకున్న పోలీసులు వారి నుంచి 470 కిలోల గంజాయి, 4 కార్లు, 11 సెల్‌ఫోన్లు, రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితులలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు రాచకొండ అదనపు సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు. రాచకొండ అదనపు సీపీ సుధీర్ బాబు మీడియాకు వివరాలు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన శ్రీకాంత్, రాహుల్‌ ఇతర రాష్ట్రాల్లోని గంజాయి డీలర్లతో సంబంధాలు పెట్టుకుని సీక్రెట్ గా గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి గ్రామం నుంచి నాలుగు వాహనాల్లో 470 కిలోల గంజాయిని హైదరాబాద్ తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో తనిఖీలు చేశామన్నారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలించేందుకు ప్రయత్నించారన్నారు. నిందితులు గంజాయిని వేరే కారులోకి మారుస్తున్నప్పుడు అదుపులోకి తీసుకున్నామని అదనపు సీపీ సుధీర్ బాబు తెలిపారు. నిందితుల నుంచి రాబట్టిన సమాచారంతో మరో ఆరుగురిని అరెస్టు చేశామన్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని, వాళ్లను త్వరలో పట్టుకుంటామని అదనపు సీపీ సుధీర్‌బాబు మీడియాకు వెల్లడించారు.