Hyderabad Ganja Seize : హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టుపడింది. గంజాయి రవాణాకు కొత్త మార్గాలు అనుసరిస్తున్నారు స్మగర్లు.  మహిళలను స్మగ్లింగ్ దందా దింపిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మహిళలకు కమీషన్ ఆశ చూపి గంజాయిను తరలిస్తోంది ఓ గ్యాంగ్. విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి తరలిస్తున్న ముఠాను సోమవారం హయత్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 10 మంది స్మగ్లర్లను పట్టుకున్న పోలీసులు వారి నుంచి 470 కిలోల గంజాయి, 4 కార్లు, 11 సెల్‌ఫోన్లు, రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితులలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు రాచకొండ అదనపు సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు.






470 కిలోల గంజాయి సీజ్ 


రాచకొండ అదనపు సీపీ సుధీర్ బాబు మీడియాకు వివరాలు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన శ్రీకాంత్, రాహుల్‌ ఇతర రాష్ట్రాల్లోని గంజాయి డీలర్లతో సంబంధాలు పెట్టుకుని సీక్రెట్ గా గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి గ్రామం నుంచి నాలుగు వాహనాల్లో 470 కిలోల గంజాయిని హైదరాబాద్ తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో తనిఖీలు చేశామన్నారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలించేందుకు ప్రయత్నించారన్నారు. నిందితులు గంజాయిని వేరే కారులోకి మారుస్తున్నప్పుడు అదుపులోకి తీసుకున్నామని అదనపు సీపీ సుధీర్ బాబు తెలిపారు. నిందితుల నుంచి రాబట్టిన సమాచారంతో మరో ఆరుగురిని అరెస్టు చేశామన్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని, వాళ్లను త్వరలో పట్టుకుంటామని అదనపు సీపీ సుధీర్‌బాబు మీడియాకు వెల్లడించారు. 



ఇటీవల 800 కిలోల గంజాయి పట్టివేత 


ఇటీవస హైదరాబాద్ నగరంలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. పత్తి విత్తనాల పేరుతో గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను పోలీసు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా గంజాయి రవాణా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ గంజాయిని ఉత్తరప్రదేశ్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు సరఫరా చేసేందుకు ప్రయత్నించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ముగ్గురు యూపీ వాసులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వారికోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.