గుంటూరు జిల్లా తాడేపల్లిలో  ముఖ్యమంత్రి జగన్ నివాసానికి కూతవేటు దూరంలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితుల్ని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. వారిద్దర్నీ గుంటూరు ఎస్పీ అర్బన్ ఎస్పీ అరీఫ్ హఫీజ్ మీడియా ముందు ప్రవేశ పెట్టారు. విజయవాడకు చెందిన నర్సుగా పని చేస్తున్న ఓ యువతి తన కాబోయే భర్తతో కలిసి జులై 19 రాత్రి సమయంలో కృష్ణానది ఇసుక తిన్నెల్లోకి వెళ్లింది. అక్కడే ఉన్న దుండగులు..   యువకుడ్ని కొట్టి యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. తర్వాత ఫోన్ ఇతర వస్తువులు లాక్కుని పరారయ్యారు. అప్పట్నుంచి పోలీసులు నిందితుల కోసం గాలిస్తూనే ఉన్నారు. 


నిందితుడు కృష్ణ కిషోర్ ని విజయవాడ రైల్వే ట్రాక్ పై పట్టుకున్నట్లుగా పోలీసులు ప్రకటించారు. ప్రధాన నిందితుడికి సంబంధించిన సమాచారం దొరక్కపోవడంతో పట్టుకోవడం ఆలస్యమయిందని ఎస్పీ వివరణ ఇచ్చారు. ఈ కేసులో షేక్ హబీబ్ కూడా ఈ నేరంలో పాలుపంచుకున్నాడని.. అత్యాచారానికి ముందు వీరు ఒకరిని హత్య చేశారని ఎస్పీ తెలిపారు. రైల్వే వంతెన పై రాగి తీగలు చోరీ చేస్తుండగా చూశాడని శనక్కాయలు అమ్ముకునే వ్యక్తి చూశాడు. ఎవరికైనా చెబుతాడేమోనని వీరు ఆ వ్యక్తిని చంపేసి.. కృష్ణానదిలో పడేసినట్లుగా ఎస్పీ తెలిపారు. కృష్ణకిషోర్ ఈ హత్యను అంగీకరించాడని ఎస్పీ ప్రకటించారు. ఆ తర్వాత కృష్ణాతీరంలో ఉన్న జంటను చూసి..అత్యాచారానికి పాల్పడ్డారన్నారు.  ఈ కేసులో మరో నిందితుడు కూడా ఉన్నారని అతను పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు 


పోలీసులు నిన్నటి వరకూ నిందితులుగా వెంకటరెడ్డి, షేర్‌ కృష్ణలను చెబుతూ వచ్చారు. అయితే వెంకటరెడ్డి అనే వ్యక్తి ఇంకా పట్టుబడలేదు. పరారీలో ఓ నిందితుడు ఉన్నాడని పోలీసులు చెప్పారు బహుశా.. అతనే ఆ నిందితుడు అని ఉంటారని భావిస్తున్నారు. నిందితులు హైదరాబాద్, చెన్నై పారిపోయారని సెల్ ఫోన్లు కూడా వాడకుండా చిన్న చిన్న పనులు చేసుకుంటూ రైల్వే బ్రిడ్జిల కిందే గడుపుతున్నారని ..మారు వేషాల్లో వెళ్లి పోలీసులు వారిని పట్టుకుని వచ్చారని  పోలీసు వర్గాలు రెండు రోజుల కిందటే మీడియాకు సమాచారం లీక్ చేశాయి. అయితే గుంటూరు ఎస్పీ మాత్రం వారిని విజయవడాలోనే రైల్వే ట్రాక్ పక్కన పట్టుకున్నట్లుగా ప్రకటించారు. 


ముఖ్యమంత్రి ఇంటికి సమీపాన జరగడం.. నిందితుల్ని పట్టుకోలేకపోయారని పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పోలీసులు ఈ కేసును చాలెంజింగ్‌గ ాతీసుకున్నారు. ఒంగోలు, చెన్నై, హైదరాబాద్‌లకు ప్రత్యేక బృందాలు వెళ్లి నిందితుల కోసం గాలించాయి. చివరికి అరెస్ట్ చేయగలిగారు.