తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవం అంటారు. నిజమే జీవితాన్ని ప్రసాదించి, పెంచి పెద్ద చేసి మన కాళ్ల మీద మనం నిలబడేటట్లు చేస్తారు. వాళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలకు చదువులు చెప్పించి  పెంచుతారు. తనకు తినడానికి ఏమిలేకపోయినా తన పిల్లలకు ఉంటే చాలు అనుకునే తల్లిదండ్రులను నిత్యం చూస్తూ ఉంటాం. పిల్లల భవిష్యత్ కోసం ఎన్నో కష్టనష్టాలను ఓర్చి వారిని పెంచి పెద్దచేస్తుంటారు. కానీ తల్లిదండ్రులు వృద్ధాప్య దశలో ఉన్నప్పుడు పరిస్థితులు మారిపోతాయి. వృద్ధాప్యంలో తోడుగా ఉండాల్సింది పోయి వృద్ధాశ్రమంలో చేరుస్తుంటారు. కానీ అంతకన్నా అమానుష ఘటనలు ఏపీలో చేటుచేసుకున్నాయి. గుంటూరు జిల్లాలో ఓ కొడుకు కాదండి ఓ కిరాతకుడు వృద్ధాప్య తల్లిని కనీసం కదలడానికే అవస్థపడుతున్న తల్లిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అలాగే కర్నూలు జిల్లాలో ఆస్తి విషయమై కన్న తండ్రిపై ఓ కిరాతక కొడుకు కర్రతో దాడి చేసిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.  


కన్న తల్లిపై అమానుష దాడి 


గుంటూరు(Guntur) జిల్లా తాడేప‌ల్లి పోలీస్ స్టేష‌న్(Tadepalli Police Station) ప‌రిధిలో క‌న్నత‌ల్లి ప‌ట్ల కొడుకు అమానుష ప్రవ‌ర్తన వెలుగు చూసింది. నిత్యం త‌ల్లిని కొడుతుండ‌టంతో స్థానికులు తీవ్ర ఆవేద‌న‌కు గుర‌య్యారు. వృద్ధాప్యంలోని తల్లిని కొడుకు చిత్రహింసలు పెడుతున్న వీడియో(Video)లను స్థానికులు చిత్రీకరించారు. ఈ వీడియోలను స్థానికులు పోలీసులకు పంపారు. బ్రాహ్మనందపురంలో వృద్ధురాలైన తల్లిని గెంటివేసి విచక్షణా రహితంగా దాడి చేశాడు కొడుకు. వృద్ధాప్యంలో తోడుగా ఉండి చూసుకోవాల్సిన కన్న కొడుకు తల్లితో కర్కశంగా వ్యవహరించాడు. కనీసం పైకి లేచే ఓపిక లేని తల్లిపై దాడి చేసిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. కనీసం అడ్డుకున్నవారు లేకపోవడంతో ఆమె వేదన అరణ్య రోదనగా మారింది. స్థానికులు రహస్యంగా పోలీసులకు సమాచారం ఇవ్వటంతో తాడేపల్లి పోలీసులు నిందితుడు శేషును అదుపులోకి తీసుకున్నారు.



ఆస్తి కోసం తండ్రిపై దాడి  


కర్నూలు(Kurnool) జిల్లాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని గోనెగండ్ల మండలం పెద్దమరవిడు గ్రామంలో ఆస్తి కోసం తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేశాడు కొడుకు, కోడలు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడి వీడియోలు వైరల్(Viral) అయ్యాయి. ఈ వీడియోలో కిందపడిపోయిన తండ్రిపై కన్న కొడుకే కర్రతో దాడి చేశాడు. తండ్రి ప్రతిఘటించేందుకు ప్రయత్నిస్తే అతడ్ని కోడలు అడ్డుకుంది. కర్రతో ఇరువురు దాడి చేశారు. స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోయింది.