గుంటూరు జిల్లాలో గురువారం దారుణమైన ఘటన వెలుగుచూసింది. గుంటూరుకు 28 కి.మీ దూరంలో బుధవారం రాత్రి వివాహితపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దారికాసి, భార్యభర్తలిద్దరినీ తీవ్రంగా కొట్టి అఘాయిత్యానికి పాల్పడ్డారు. భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కొడవళ్లతో బెదిరించి నగలు, నగదు కూడా అపహరించారు. మూడు నెలల కిందట తాడేపల్లికి సమీపంలో సీతానగరం పుష్కరఘాట్‌ వద్ద సామూహిక అత్యాచార ఘటన మరవకముందే అదే తరహాలో మరో ఘటన జరగడం జిల్లాలో కలకలంరేపుతోంది. 


కర్ర అడ్డుపెట్టి.. బైక్ పడగొట్టి


గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన దంపతులు బుధవారం మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యి రాత్రి తిరిగి ఇంటికి బయలుదేరారు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత దారికి అడ్డంగా ఓ చెట్టు కొమ్మ పడిఉంది. దాన్ని తప్పించి బైక్ ను ముందుకు వెళ్లారు. ఇంతలో అకస్మాత్తుగా దుండగులు ఓ కర్రను బైక్‌ చక్రంలో పెట్టి వారిద్దరినీ కిందపడగొట్టారు. వెంటనే వారిపై దాడిచేశారు. కొడవళ్లు చూపించి సమీపంలోని పొలాల్లోకి లాక్కెళ్లారు. ఆ మార్గంలో వెళ్లేవారికి అనుమానం రాకుండా బాధితుల ద్విచక్రవాహనాన్ని కూడా పొలాల్లోకి లాక్కె దించేశారు. బాధితురాలి భర్తను కట్టేసి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. 


ఇటీవల దారి దోపిడీలు


అత్యాచారం అనంతరం దుండగులు బాధితురాలి వద్ద బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ కొడవళ్లు చూపించి బెదిరించారు. దుండగుల్లో ముగ్గురు తెలుగులో మాట్లాడారని, ఒకరు వేరే భాషలో మాట్లాడినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపారు. వారంతా ముఖాలకు మాస్కులు ధరించినట్లు పేర్కొన్నారు. స్థానికులే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల మేడికొండూరు మండలంలో ఇటువంటి దోపిడీలు ఘటనలు చోటుచేసుకున్నాయని పోలీసులు అంటున్నారు. వీటి వెనుక ఏదైనా ముఠా ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనాస్థలిలో పోలీసుల గాడ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. ఓ జాగితం దగ్గర్లోని గిడ్డంగి దగ్గరకు వెళ్లి ఆగింది. ఘటనాస్థలికి దగ్గర్లో శీతల గిడ్డంగి నిర్మాణం జరుగుతోంది. అక్కడ ఒడిశా, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారితో పాటు స్థానికులు పనిచేస్తున్నారు. పోలీసులు అక్కడ పనిచేస్తున్న కూలీలను విచారించారు. బాధితురాలిని గుంటూరు జీజీహెచ్‌లో చేర్చారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. 


జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు


బుధవారం రాత్రి సంఘటన అనంతరం బాధితులు సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. కానీ పోలీసులు తమ పరిధిలోకి రాదంటూ మేడికొండూరుకు పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. అక్కడి పోలీసులు సత్తెనపల్లి స్టేషన్‌కు చేరుకునే వరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. చివరికి బాధితుల్ని మేడికొండూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అక్కడ కేసు పెట్టారు. ఆపదలో ఉన్న బాధితులు ఫిర్యాదు చేసేందుకు వస్తే ఘటనాస్థలం తమ పరిధిలోకి రాదని నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలు వస్తున్నాయి. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఉన్నతాధికారులు పదేపదే చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.


 


Also Read: Bankers Meeting: రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం.. వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరిన ఏపీ సీఎం జగన్