20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా 2019-20లో దేశంలో పన్నుల ఆదాయం మొత్తం 3.38శాతం తగ్గిందని సీఎం జగన్ అన్నారు. 2020-21లో కూడా కోవిడ్‌ విస్తరణను అడ్డుకోవడానికి లాక్‌డౌన్, ఇతరత్రా ఆంక్షల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం కొనసాగిందని వివరించారు. దేశ జీడీపీ వృద్ధిరేటు 7.25శాతం మేర పడిపోయిందని జగన్ చెప్పారు. మొదటి త్రైమాసికంలో అయితే 24.43 శాతం మేర జీడీపీ వృద్ధిరేటు పడిపోయిందని... ఈ క్లిష్ట సమయంలో బ్యాంకర్ల సహకారం కారణంగా దేశంతో పోలిస్తే ఏపీ సమర్థవంతమైన పనితీరు చూపిందని చెప్పుకొచ్చారు. 2020-21లో దేశ జీడీపీ 7.25 శాతం మేర తగ్గితే ఏపీలో 2.58 శాతానికి పరిమితమైందని విశ్లేషించారు. గతేడాది ఇదే పీరియడ్‌తో పోలిస్తే టర్మ్‌ రుణాలు రూ. 3,237 కోట్లు తక్కువగా నమోదయ్యాయని.. వ్యవసాయరంగానికి 1.32 శాతం తక్కువగా రుణ పంపిణీ జరిగిందన్నారు.


4,91,330 మంది కౌలు రైతులకు క్రాప్‌ కల్టివేటర్‌ రైట్‌ కార్డులను (సీసీఆర్‌సీ) ఇచ్చామని, వారందరికీ వెంటనే పంట రుణాలివ్వాలని బ్యాంకర్లను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. కౌలు రైతులకు కార్డులివ్వడంతోపాటు వారి వివరాలన్నింటినీ ఈ-క్రాప్‌లో నమోదు చేశామని చెప్పారు. వీరు ఎక్కడ భూమిని కౌలుకు తీసుకున్నారు. వాటి సర్వే నెంబర్లు.. ఏ పంట వేశారన్న వివరాలన్నీ అందులో ఉంటాయన్నారు. రైతు భరోసా కేంద్రాలతో అనుసంధానించి, వారి వివరాల్ని ధ్రువీకరిస్తున్నామని సీఎం వెల్లడించారు. ఈ-క్రాపింగ్‌తో రైతులకు వడ్డీ లేని పంట రుణాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా అందించటంతోపాటు బ్యాంకులిచ్చే రుణాలకు భద్రత ఉంటుందని జగన్ చెప్పారు. కౌలురైతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.


మొదటి విడతలో 15 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం చేస్తున్నామని... ఒక్కో లబ్ధిదారునికి కనీసంగా రూ.4-5లక్షల ఆస్తిని సమకూరుస్తున్నామని సీఎం చెప్పారు. ఇంటి నిర్మాణంకోసం రుణం ఇచ్చే దిశగా బ్యాంకులు అడుగులు ముందుకేయాలని కోరారు. దీనివల్ల ఇళ్ల నిర్మాణంలో వారికి తగిన తోడ్పాటు లభిస్తుందని చెప్పారు. బ్యాంకులు 3 శాతం వడ్డీకి ఇస్తే, మిగిలిన వడ్డీని ప్రభుత్వం భరిస్తుందని... దీనిపై బ్యాంకులు చురుగ్గా చర్యలు తీసుకోవాలని సీఎం బ్యాంకర్లను కోరారు.


9.05 లక్షలమంది చిరువ్యాపారులు జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందారని సీఎం చెప్పారు. అందులో అర్హులైన వారికి రుణాలు మంజూరు ప్రక్రియ కొనసాగేలా బ్యాంకులు దృష్టిసారించాలని సూచించారు. ఎంఎస్‌ఎంఈలకు తోడుగా నిలవాలని బ్యాంకర్లను సీఎం జగన్ కోరారు. వీరికి తగిన తోడ్పాటు అందించాలని బ్యాంకర్లకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఆర్దిక మంత్రి బుగ్గన..సీఎస్ దాస్ ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు..బ్యాంకుల తోడ్పాటు గురించి వివరించారు.


Also Read: Ganesh Chaturthi 2021: వినాయక చవితి పూజ ఎలా చేయాలి.. అసలు మంత్రాలు ఏంటి?