Guntur Crime : గుంటూరు జిల్లా తెనాలి మారిస్ పేటలో దారుణం చోటుచేసుకుంది.  వాలంటీర్ సందీప్ ని యువకుడు(మైనర్) కొట్టి చంపాడు. మారిస్ పేటలో 24వ వార్డు వాలంటీర్ గా పనిచేస్తున్న సందీప్(22)ని మైనర్ (17) హత్య చేశాడు.  సందీప్ వద్ద యువకుడు రూ.2000 అప్పుగా తీసుకున్నాడు. డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు సందీప్ తో మైనర్ గొడవపట్టాడు. తన తండ్రి వెంకటేశ్వర్లుతో కలసి సందీప్ పై దాడి చేశాడు మైనర్. ఈ గొడవలో సందీప్ గుండెపై బలంగా దెబ్బ తగలడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.  మైనర్ సహా అతని తండ్రి వెంకటేశ్వర్లును తెనాలి మూడో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


రూ.200 కోసం లారీతో ఈడ్చుకెళ్లి 


గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. లారీలో ప్రయాణించిన మహిళ రూ.200 ఇవ్వలేదని లారీతో ఈడ్చుకెళ్లాడు డ్రైవర్. ఈ ఘటనలో లారీ కింద పడి ఆమె మృతిచెందింది. పోలీసులు వివరాల ప్రకారం.. చిలకలూరిపేటకు చెందిన రమణ(40) అనే మహిళ చిత్తు కాగితాలు ఏరుకుని, వాటిని అమ్ముకుంటూ జీవిస్తోంది. ఉపాధి కోసం తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని చిలకలూరిపేట నుంచి గుంటూరుకు వెళ్లడానికి ఓ లారీ ఎక్కింది. గుంటూరులోని నాయుడుపేట జిందాల్‌ కంపెనీ సమీపంలోకి రాగానే పిల్లలతో సహా రమణ లారీ దిగింది. తన వద్ద ఉన్న రూ.100ను  డ్రైవర్‌కు ఇచ్చింది. అయితే అతను మరో రూ.200 ఇవ్వాలని రమణను డిమాండ్‌ చేశాడు.


సెల్ ఫోన్ లాక్కొన్న డ్రైవర్ 


తన దగ్గర అంతకన్నా డబ్బుల్లేవని రమణ డ్రైవర్ కు చెప్పింది.  ఎంత చెప్పినా డ్రైవర్‌ వినలేదు. ఆమె కుమార్తె చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ని లాక్కొని లారీని ముందుకు తీశాడు. సెల్‌ఫోన్‌ని తీసుకోవాలనే ఉద్దేశంతో రమణ కుమార్తె లారీ ఎక్కగానే డ్రైవర్‌ ముందుకు పోనిచ్చాడు. దీంతో కంగారు పడిన రమణ లారీని పట్టుకుని పరిగెత్తుతూ అదుపుతప్పి లారీ కింద పడిపోయింది. మహిళ చనిపోవడాన్ని గమనించిన లారీ డ్రైవర్ లారీ ఆపి బాలికను కిందకు దించి, అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 


Also Read : MLC Car Dead Body : వైసీపీ ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ డెడ్ బాడీ కలకలం, కొట్టిచంపారని కుటుంబసభ్యుల ఆరోపణ


Also Read : Guntur Crime : గుంటూరు జిల్లాలో దారుణం, తొమ్మిదో తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం