Guntur Crime News: సాఫ్ట్ వేర్ ఉద్యోగం పేరుతో యువతిని మోసం చేయడమే కాకుండా ఆమె పేరిట ఎడ్యుకేషన్ లోన్ కూడా తీసుకున్నారు. రెండున్నర లక్షలు తీసుకున్నా ఆమెకు మాత్రం ఎలాంటి సమాచారం లేదు. తీరా లోన్ తీసుకున్న వాళ్లు చెల్లించకపోవడంతో బ్యాంకు వాళ్లు సదరు యువతి వద్దకు వచ్చి డబ్బులు చెల్లించమంటున్నారు. ఏం చేయాలో పాలుపోని యువతి పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణ్యం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఏఎస్పీ శ్రీనివాస రావు ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు.
అసలేం జరిగిందంటే ..?
గుంటూరు జిల్లా పొన్నూరు మండలానికి చెందిన యువతి గత ఏడాది బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ వేటలో పడింది. ఈక్రమంలోనే చాలా ఉద్యోగాలకు దరఖాస్తు కూడా చేసుకుంది. ఆన్ లైన్ లో తమిళనాడు చెంగల్ పట్టు ప్రాంతానికి చెందిన ఓ సంస్థ కౌన్సిలర్ గా పని చేస్తున్న కృష్ణ.. ఆమె దరఖాస్తు, పాన్ కార్డు డౌన్ లోడ్ చేసుకున్నాడు. ఆన్ లైన్ లోనే ఇంటర్వ్యూ నిర్వహించి నాలుగు నెలల ఉచితంగా శిక్షణ ఇస్తామని ఏడాదికి 4 లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం ఇస్తామన్నారు. కొద్ది రోజులకు ల్యాప్ టాప్ ను కూడా పంపించారు. ఆమెతో చేరిన బ్యాచ్ సభ్యులందరికీ కొద్ది నెలల తర్వాత శిక్షణ ప్రారంభిస్తామన్నారు. సరే అని ఆమె చాలా కాలంగా ఎదురు చూస్తూనే ఉంది. ఆరు నెలలు గడిచినా శిక్షణ మెదలు కాలేదు. ఉద్యోగం కూడా రాలేదు.
ఇంతలోనే విజయవాడకు చెందిన విద్యార్థులకు రుణాలు మంజూరు చేసే ఓ సంస్థ సిబ్బంది ఆమె ఇంటికి వచ్చారు. విద్యా రుణం కింద రెండు లక్షల 30 వేలు తీసుకున్నారని... ఏడు వాయిదాలు బాకీ ఉంది, చెల్లించలేదని తెలిపారు. వెంటనే రుణం కట్టకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లోన్ రికవరీ సిబ్బంది చెప్పిన మాటలకు సదరు యువతి తీవ్రంగా భయపడిపోయింది. ఏం చేయాలో పాలుపోక తమిళనాడులోని సంస్థ ప్రతినిధులకు ఫోన్ చేస్తే... మీరేమీ కాంగారు పడొద్దు ఆ వాయిదాలు మేమే చెల్లిస్తామని మీకేం సంబంధం లేదని సమాధానం ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత ఎడ్యుకేషన్ లోన్ సంస్థ వారు ద్వారా ముంబయి నుంచి ఆ యువితకి నోటీసులు పంపించారు. లోన్ సంస్థ మేనేజర్ ఫోన్ చేసి ఈ ఏడాది జనవరి 5వ తేదీలోగా రుణం కట్టకపోతే ఆమె చెక్కులు బ్యాంకులో వేయడంతో పాటు కేసు పెడతామని ఉద్యోగానికి పనికి రాకుండా చేస్తామని బెదిరించారు.
దీంతో బాధిత యువతి తన తండ్రితో కలిసి ఏఎస్పీని కలిసి తాను వారి వద్ద రుణం తీసుకోలేదని, చెక్కులు ఇవ్వలేదని అయినా రుణం కట్టమంటూ వేధిస్తున్నారని వాపోయింది. తనను, తన కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని తమకు ఆత్మహత్య శరణ్యమని కన్నీటి పర్యంతం అయింది. తానేమీ డాక్యుమెంట్లు ఇవ్వలేదని, ఎక్కడా సంతకాలు చేయలేదని వాపోయింది. అసలు బ్యాంకు రుణం తీసుకుంది తాను కాదని తెలిపింది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తన పేరుతో రుణం తీసుకొని తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరింది.