Ramya Murder Case : గుంటూరు బీటెక్ విద్యార్థి రమ్య హత్య కేసులో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధించింది. గుంటూరులోని గత ఏడాది ఆగస్టు 15న బీటెక్ విద్యార్థిని రమ్యను నిందితుడు శశికృష్ణ హత్య చేశాడు. ఈ కేసుల 28 మంది సాక్షులను ధర్మాసనం విచారించింది. నిందితుడికి హైకోర్టులో అఫీల్ చేసుకోవడానికి న్యాయమూర్తి అవకాశం ఇచ్చారు. గుంటూరు 4వ ప్రత్యేక  న్యాయమూర్తి రాంగోపాల్ ఈ కేసులో తీర్పు ఇచ్చారు. ఈ కేసుపై డిసెంబర్‌లో విచారణ ప్రారంభించింది కోర్టు. ఈనెల 26వ తేదీకి విచారణ పూర్తి అయింది.  



ఇవాళ ఏం జరిగింది?


శుక్రవారం నిందితుడు శశీకృష్ణ కోర్టుకు తీసుకువచ్చారు. నిందితుడు శశికృష్ణ నేరం రుజువు అయిందని న్యాయస్థానం తెలిపింది. విచారణలో నిందితుడిని కోర్టు ఏమైనా చెబుతావా అని అడిగింది. అప్పుడు మా తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని నిందితుడు తెలిపాడు. తల్లిదండ్రులు ఆరోగ్యం బాగా లేదని, తాను చూసుకోవాలని నిందితుడు కోర్టుకు తెలిపాడు. నిందితుడు నడి రోడ్డుపై హత్య చేశారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాడోపవాదనలు విన్న కోర్టు తుది తీర్పు ఇచ్చింది. 


ఆగస్టు 15న ఘోరం 


ఏపీలో గత ఏడాది ఆగస్టు 15న బీటెక్‌ విద్యార్థిని రమ్య దారుణ హత్యకు గురైంది. గుంటూరులోని పెదకాకాని రోడ్డులోని పరమాయికుంటలో టిఫిన్ తీసుకెళ్లేందుకు వచ్చిన రమ్యను ఓ యువకుడు కత్తితో పొడిచాడు. రక్తపు మడుగులో ఉన్న రమ్యను ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. రమ్యపై దాడి చేస్తున్న సమయంలో కొందరు స్థానికులు యువకుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ నిందితుడు స్థానికులను బెదిరించి బైక్‌పై పరారయ్యాడు. దీనికి సంబంధించిన ఫుటేజ్ అక్కడి సీసీ టీవీ కెమెరాలలో రికార్డు అయ్యింది. రమ్య ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. రమ్యకు పరిచయం ఉన్న యువకుడే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో వేధించి ఒప్పుకోలేదని చివరకు ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. నిందితుడు శశికృష్ణను అతని స్వగ్రామం వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారించింది. 9 నెలల్లోనే విచారణ పూర్తి చేసి నిందితుడికి ఉరిశిక్ష విధించింది. 


రమ్య ఆత్మకు శాంతి : తల్లిదండ్రులు 


తమ కుమార్తే రమ్యకు జరిగిన ఘోరం ఎవ్వరకీ జరగకూడదని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి కలిగిందన్నారు. దిశ చట్టంతోనే న్యాయం జరిగిందన్నారు. ప్రేమోన్మాదులకు ఇలాంటి శిక్షలు పడాలని, అప్పుడే నేరాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే నిందితుడు శశికృష్ణ తల్లిదండ్రులు తమకు న్యాయ చేయాలని కోరారు. తినడానికి తిండే లేని తమ కుటుంబానికి కొడుకే ఆధారమని అన్నారు. ఇప్పుడు అతడికి ఉరిశిక్ష వేస్తే తమను ఇంకెవరు చూసుకుంటాని ఆవేదన చెందారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నారు.