US Gun Firing: 


కాల్పుల మోత..


అమెరికాలో కాల్పుల మోతలు కొనసాగుతూనే ఉన్నాయి. తరచూ ఏదో ఓ చోట గన్‌ ఫైరింగ్ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఫ్లోరిడాలోని జాక్సన్ విల్లే ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. ఓ గన్‌మ్యాన్ నల్లజాతికి చెందిన ముగ్గురిని కాల్చి చంపాడు. ఆ తరవాత తనను తాను కాల్చుకుని చనిపోయాడు. ఈ కాల్పులకు జాతి వివక్షే కారణమని పోలీసులు వెల్లడించారు. 20 ఏళ్ల నిందితుడు ఓ జనరల్ స్టోర్‌లోకి వెళ్లి ఉన్నట్టుండి కాల్పులు జరిపాడు. పోలీసులు వచ్చినా ఆగకుండా ఫైరింగ్‌ చేశాడు. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం...చనిపోయిన ముగ్గురిలో ఇద్దరు పురుషులు కాగా మరొకరు మహిళ. ఓ లైట్‌వెయిట్ రైఫిల్‌తో కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. కేవలం జాతి వివక్ష కారణంగానే ఆ ముగ్గురినీ కాల్చి చంపాడని వెల్లడించారు. తనను తాను కాల్చుకున్నట్టుగా నటించి ఆ తరవాత ఆ ముగ్గురిపైనా కాాల్పులు జరిపాడు. అయితే...నిందితుడి గన్‌పై స్వస్తిక్ సింబల్‌ ఉండటం కీలకంగా మారింది. ఇప్పటికే FBI రంగంలోకి దిగి ఈ ఘటనపై విచారణ చేపడుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కాల్పులు జరుగుతున్నాయి. ప్రతి చిన్న కారణానికీ కాల్చి పారేస్తున్నారు. దీనికి తోడు జాతి వివక్ష కూడా ప్రాణాలు తీస్తోంది. చాలా రోజులు అమెరికా ప్రజలు గన్ కల్చర్‌పై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి హింసాత్మక ఘటనలు భయాందోళనకు గురి చేస్తున్నాయని, కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 


బాలిక హత్య..


అమెరికాలోని కొలొరాడోలో ఓ 16 కుర్రాడు ఎక్స్‌ గర్ల్‌ఫ్రెండ్‌ (15)ని చంపేశాడు. ఆ యువతి సోదరుడి ముందే హత్య చేశాడు. జూన్ 16న ఈ ఘటన జరిగినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లి అక్కడే గన్‌తో కాల్చి చంపాడు. హడావుడిగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాడు. అక్కడి సీసీటీవీ ఈ వీడియో రికార్డ్ అయింది. ఆ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు. హత్య చేసిన తరవాత ఆ యువతి బెడ్‌ రూమ్‌లోని కిటికీ నుంచి బయటకు దూకేశాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం...నిందితుడు గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. హాల్‌లో ఆమె సోదరుడు టీవీ చూస్తున్నాడు. ఉన్నట్టుండి బెడ్‌ రూమ్‌లో నుంచి గట్టిగా కేకలు వినిపించాయి. దాదాపు ఐదు రౌండ్ల కాల్పులు వినిపించాయి. వెంటనే రూమ్‌లోకి వెళ్లి చూశాడు. అక్క ఫ్లోర్‌పై పడిపోయి ఉండడాన్ని చూసి వణికిపోయాడు. పక్కనే ఆ నిందితుడు గన్ పట్టుకుని నిల్చుని ఉన్నాడు. ఆ కుర్రాడిపైనా కాల్పులు జరిపేందుకు ప్రయత్నించినా...వద్దంటూ వేడుకున్నాడు. చివరకు ఆ చిన్నారి దగ్గరున్న ఐఫోన్‌ లాక్కుని కిటికీలో నుంచి దూకి పారిపోయాడు 16 ఏళ్ల నిందితుడు. ఆ తరవాత మృతురాలి సోదరుడు పోలీసులకు కాల్ చేశాడు. వాళ్లు వచ్చి ఇంటిని సీజ్ చేశారు. బెడ్‌ రూమ్‌లోని డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలు, నిందితుడు ఇద్దరి వయసూ 17 ఏళ్ల లోపే.


Also Read: పశ్చిమ బెంగాల్‌లో ఘోరం, బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు - ఏడుగురు మృతి