Lovers Suicide: వారిద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. కలిసే జీవించాలనుకున్నారు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు కూడా చెప్పారు. కానీ వాళ్లు వద్దని వారించారు. ఎంతగా, ఎన్ని రోజుల నుంచి బతిమాలుతున్నా వారు వినలేదు. అంతేనా మళ్లీ మీరు మాట్లాడుకున్నట్లు తెలిసినా సహించబోమన్నారు. పెద్దల కోపానికి తమ ప్రేమ బలైపోతుందనుకున్న ఆ యువతి.. ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుసుకున్న ప్రియుడు.. తన ప్రియసఖి లేని లోకంలో ఉండలేనని భావించాడు. ఓ వైపు కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే... మరోవైపు పురుగుల మందు తాగాడు. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉంది.
పురుగుల మందు తాగేసింది..
ఏలూరు జిల్లా నూజివీడు స్టేషన్ తోటకు చెందిన మేకల రాణి, కొండా ప్రదీప్ లు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఎన్ని రోజులు అయినా సరే పెద్దలను ఒప్పించే పెళ్లి చేసుకుందామనుకున్నారు. అదే విషయాన్ని ఇరు కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే పిల్లల ప్రేమను అర్థం చేసుకోలేని పెద్దలు.. వద్దని వారించారు. వారికి కలవకూడదని హెచ్చరించారు. దీంతో మనస్తాపానికి గురైన రాణి ఎలుకల మందు తాగింది. అది గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడకి తీసుకెళ్లమని సూచించారు. హుటాహుటిన విజయవాడకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే రాణి మృతి చెందింది.
ప్రియురాలు మృతితో విషం తాగిన ప్రియుడు..
అయితే స్థానికుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఆమె ప్రియుడు కొండా ప్రదీప్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఏం చేయాలో పాలుపోక చాలా సేపు పిచ్చెక్కిన వాడిలా రోడ్లపై తిరిగాడు. అనంతరం తాను కూడా విషం తీసుకున్నాడు. అయితే విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు అతడిని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. అయితే గ్రామస్థుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మొన్న భార్య, నిన్న భర్త ఆత్మహత్య...
ఇటు శ్రీకాకుళం జిల్లాలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. నాలుగు రోజుల క్రితం ఓ మహిళ ఇంట్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఆమె చావుకు భర్త కారణం అన్న అనుమానంతో పోలీసులు అతడిని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఈరోజు అతడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఇతడి ఆత్మహత్యపై అతని కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంత చిన్న పోలీస్ స్టేషన్ లో అతడెలా చనిపోతాడంటూ కామెంట్లు చేస్తున్నారు. అయినా అతడు ఆత్మహత్య చేసుకుంటుంటే పోలీసులు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు.
భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగానే..
జిల్లాలోని ఎల్.ఎన్ పేట మండలం కొమ్మవలసకు చెందిన మహేష్.. వృత్తి రీత్యా వాహన డ్రైవర్. అయితే ఇటీవలే అతను బూర్జపేట మండలం సుంకరిపేటకు చెందిన శ్రీదేవిని వివాహం చేసుకున్నాడు. శ్రీదేవికి ఇది రెండో పెళ్లి. ఆమె బూర్జ మండలంలో వీఆర్ఏగా పని చేస్తోంది. అయితే పెళ్లి జరిగినప్పటి నుంచి అతడు అత్తవారింటి దగ్గరే ఉంటున్నాడు. కొన్ని రోజులపాటు బాగానే సాగిన వీరి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. చిన్న చిన్న మనస్పర్థల కారణంగా భార్య శ్రీదేవి నాలుగు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకుంది. అయితే తమ కూతురు చావుకు అల్లుడే కారణం అని.. శ్రీదేవి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆదివారం రోజు మహేష్ ని విచారణ పేరిట అదుపులోకి తీసుకున్నారు. అయితే రెండ్రోజుల తర్వాత అతడు పీఎస్ లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై అతడి కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.