Girl Abused By A Man In Tirupati: తిరుపతిలో (Tirupati) దారుణం వెలుగుచూసింది. నగరంలోని ఓ పాఠశాలలో బాలికపై వ్యక్తి అత్యాచారానికి పాల్పడగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఓ ప్రభుత్వ బాలికల వసతి, పరిశీలన గృహంలో ఉంటున్న బాలిక (14) తొమ్మిదో తరగతి చదువుతోంది. సత్యవేడు మండలం కన్నవరానికి చెందిన రుషి (40) బుధవారం మధ్యాహ్నం భోజన విరామం సమయంలో పాఠశాలలో ప్రవేశించి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఒంటిపై గాయాలతో ఉన్న బాలికను గుర్తించిన తోటి విద్యార్థులు, సిబ్బంది ప్రశ్నించగా ఆమె జరిగిన విషయం చెప్పింది.


అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు తిరుపతి వెస్ట్ పోలీసులు శుక్రవారం నిందితునిపై కేసు నమోదు చేశారు. కాగా, హాస్టల్‌కు సరుకులు సరఫరా చేసే నిందితుడు బాలికతో పరిచయం ఏర్పరుచుకుని అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటన బుధవారమే జరిగినా వసతి గృహం అధికారులు గోప్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగుచూసింది. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా.. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.


మైనర్‌పై అత్యాచారం


అటు, శ్రీకాళహస్తిలో (Srikalahasthi) మరో ఘోరం జరిగింది. మైనర్‌పై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం వెలుగుచూసింది. పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. బహదూర్‌పేటకు చెందిన బాలిక చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను కోల్పోగా అమ్మమ్మ సంరక్షణలో ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలో నలుగురు యువకులు ఆమెకు మాయమాటలు చెప్పి.. పలుమార్లు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించడంతో బాలిక మిన్నకుండిపోయింది. అయితే, ఇటీవల అత్యాచార విషయం వెలుగులోకి రావడంతో గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి నిందితులను మందలించి వదిలేశారు. 


గర్భం దాల్చడంతో


ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చిన విషయం తెలుసుకున్న అమ్మమ్మ గురువారం రాత్రి శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో నలుగురు నిందితులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం శుక్రవారం ప్రాంతీయ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అక్కడి నుంచి తిరుపతి రుయాకు తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Also Read: Tirumala News: పెళ్లై 15 రోజులే - శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా కుప్పకూలిన వరుడు, చివరకు విషాదం