Theft In Police Station: ఎక్కడైన దొంగలు పడితే.. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. మరి పోలీస్ స్టేషన్‌లోనే దొంగలు పడితే..! ఏం చేయాలి..? వారు ఎవరికి చెప్పుకోవాలి. ఒక్కసారి కాదు.. రెండు సార్లు.... ఆరు నెలల వ్యవధిలోనే రెండు సార్లు ఒకే పోలీస్‌స్టేషన్‌కు కన్నమేశారు దొంగలు. అది కూడా... గంజాయి కోసం. పోలీసులు సీజ్ చేసిన గంజాయిని దోచుకెళ్లారు దొంగు. ఈ విషయం స్వయంగా పోలీసులే ఒప్పుకున్నారు. డే అంట్ నైట్ పోలీసులతో... ఫుల్ సెక్యూరిటీతో ఉండే పోలీస్ స్టేషన్‌లోనే దొంగతనం జరిగిందంటే... మరి సామాన్యుల పరిస్థితి ఏంటి..? వారికి భద్రత ఏది..? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇంతకీ చోరీ జరిగింది ఏ పోలీస్‌స్టేషన్‌లో..? పోలీస్‌స్టేషన్‌కే కన్నం వేసినా ఆ దొంగలను పోలీసులు పట్టుకోగలిగారా..?
స్టేషన్‌కే కన్నవేసిన దొంగలు
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్... ఈ స్టేషన్‌కే కన్నం వేశారు దొంగలు. అది పోలీస్‌స్టేషన్... ఎప్పుడూ పోలీసులు ఉంటారు.. దొరికితే పనిపడతారు అన్న భయం లేకుండా దర్జాగా స్టేషన్‌లో చొరబడి దొంగతనం చేశారు. పోలీసులు సీజ్ చేసి భద్రపరిచిన గంజాయిని... దోచుకెళ్లారు దొంగలు. ఎవరి కంటా పడకుండా... పోలీస్ స్టేషన్‌లోని స్టోర్‌రూమ్‌లోకి చొరబడి... అక్కడున్న గంజాయితో ఉడాయించారు. ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్టు సీఐ గఫూర్ తెలిపారు.
గంజాయితో ఉడాయించిన దొంగలు
ఎలమంచిలి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... వేర్వేరు ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్న గంజాయిని... రూరల్ పోలీస్ స్టేషన్‌లోని స్టోర్ రూమ్‌లో భద్రపరచారు. అయితే ఎలమంచిలికే చెందిన రవితేజ, కుసుమకుమార్, తేజ, సాయి, వెంకటేష్, గణేష్, మరో ఇద్దరు మైనర్లు కలిసి... ఆ గంజాయిని దొంగిలించారు. స్టోర్ రూమ్ కిటికీ గ్రిల్ తొలగించి.. లోపలికి చొరబడ్డారు. స్టోర్ రూమ్‌లో దాచిన 362 కిలోల గంజాయి దోచుకెళ్లారు. ఆరు నెలల క్రితం ఒకసారి... 15 రోజుల క్రితం ఒకసారి.. ఇలా రెండుసార్లుగా మొత్తం గంజాయి ఎత్తుకెళ్లారు. స్టేషన్‌లో భద్రపరిచిన గంజాయి చోరీ అవడంతో... పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 310 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తు వేగవంతం
పోలీస్‌స్టేషన్‌కే కన్నమేశారంటే... వారు మామూలోళ్లు కాదు అనుకున్నారో ఏమో...? ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించనున్నట్టు తెలిపారు పోలీసు అధికారులు. నిందితులకు సంబంధించి.. గత రికార్డులు కూడా వెరిఫై చేస్తున్నారు పోలీసులు. పోలీస్ స్టేషన్‌కు కన్నం వేయడం ఇదే మొదటిసారా..? లేక ఇలాంటి చోరీలు ముందు కూడా చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేయనున్నారు. అలా... దొంగిలించిన గంజాయిని ఏం చేయబోయారు..? పోలీస్‌స్టేషన్ నుంచి 362 కేజీల గంజాయిని తీసుకెళ్లిన వారి నుంచి... 310 కిలోలు మాత్రమే రికవరీ చేశారు పోలీసులు. మరి మిగిలిన గంజాయిని ఏం చేశారు..? ఎవరికి విక్రయించారు..? అన్నదానిపై కూడా ఆరా తీస్తున్నారు. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తే... గంజాయి ముఠా లింకులు కూడా బయటపడే అవకాశం ఉందంటున్నారు పోలీసులు.
పోలీసులు అరెస్ట్ చేసిన ఎనిమిది మంది నిందితుల్లో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. వారు మైనర్లు కావడంతో.. వారి వివరాలు గోప్యంగా ఉంచారు పోలీసులు. ఈ ముఠా కేవలం దొంగతనాలు చేసే గ్యాంగేనా...? లేక... గంజాయి బ్యాచ్‌లో సంబంధాలు ఉన్నాయా అన్నది కూడా విచారణలో తేలుస్తామంటున్నారు పోలీసులు. ప్రస్తుతం ఎనిమిది మంది నిందితులను రిమాండ్‌కు పంపారు.