Gang Attacked on Parents Of Young Girl: రంగారెడ్డి (Rangareddy) జిల్లా నార్సింగిలో దారుణం జరిగింది. తమ కూతురితో అసభ్యంగా ప్రవర్తించిన యువకున్ని ప్రశ్నించిన తల్లిదండ్రులపై ఓ గ్యాంగ్ దాడికి పాల్పడింది. ఈ క్రమంలో ఆ గ్యాంగ్ లోని ఓ నిందితుడు యువతి తండ్రి గొంతు కోశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెమలినగర్ లో ఓ యువతి దుకాణానికి వెళ్లగా.. సురేష్ అనే యువకుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. హోలీ రోజు తప్పించుకున్నావంటూ.. ఆమెపై నీళ్లు పోశాడు. అతడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న యువతి ఏడుస్తూ ఇంటికి వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ప్రశ్నించేందుకు వెళ్లిన తల్లిదండ్రులపై సురేశ్ గ్యాంగ్ దాడికి పాల్పడింది. అనంతరం సురేష్ స్నేహితుడు కత్తితో యువతి తండ్రి గొంతు కోశాడు. అడ్డువచ్చిన యువతి తల్లిపైనా దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. సురేష్ తో పాటు అతని గ్యాంగ్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. నిందితుల నుంచి 4 కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.


మరో ఘటన


అటు, ఆస్తి తగాదాల విషయంలో ఓ కొడుకు కన్న తండ్రి గొంతు కోశాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం బీరెల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అనంతయ్య అనే వ్యక్తి చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతని కుమారుడు రమేష్ తాగుడుకు బానిసై తండ్రి పేరుపై ఉన్న రెండెకరాలు భూమి అమ్ముకున్నాడు. ఇప్పుడు ఇంటిని కూడా అమ్మాలని తండ్రిపై ఒత్తిడి తెచ్చాడు. దీనిపై వారు ససేమిరా అనగా.. తండ్రి గొంతు కోశాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు విషయం తెలపగా.. అనంతయ్యను వికారాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్తి కోసం కొడుకు రమేష్.. తండ్రి గొంతు కోశాడని కుటుంబీకులు ఆరోపించారు.


Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం - రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు