Radhakishan Rao Remand Report in Phone Tapping Case: రాష్ట్రంలోనే సంచలనం కలిగించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం (Phone Tapping Case) రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేసిన మరో సీనియర్ అధికారి పేరు తెరపైకి రాగా.. ఆయన్ను విచారించేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సదరు అధికారి.. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావుకు అత్యంత సన్నిహితుడని సమాచారం. సీనియర్ అధికారితో పాటు ఓ ఇన్ స్పెక్టర్ కు సైతం నోటీసులు ఇచ్చి విచారించాలని దర్యాప్తు బృందం భావిస్తోంది. మరోవైపు, ఈ కేసులో రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీగా ఉన్న ఆయన్ను కేసులో ఏ4గా చేర్చారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో భవ్య సిమెంట్ యజమాని ఆనంద్ ప్రసాద్ నుంచి రూ.70 లక్షలు సీజ్ చేసినట్లు రాధాకిషన్ రావు వెల్లడించారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు, ఆయన బంధువుల నుంచి రూ.కోటి సీజ్ చేశామని అంగీకరించారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెందిన రూ.3.50 కోట్లు సీజ్ చేశామని చెప్పారు. 2016లో ఓ వర్గానికి చెందిన అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని రాధాకిషన్ రావు వెల్లడించారని.. రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను అరెస్ట్ చేశారు. అటు, ఈ కేసులో కీలక వ్యక్తి అయిన ప్రభాకర్ రావు అమెరికా నుంచి హైదరాబాద్ వస్తున్నారని సమాచారం.


ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో మొదట మాజీ పోలీస్ అధికారి ప్రణీత్ రావు ను అరెస్ట్ చేసింది. విచారణలో ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లతో పాటు ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా నేతల ఫోన్లు ట్యాప్ చేసి వారి ఎన్నికల సంబంధిత, వ్యక్తిగత విషయాలపై నిఘా పెట్టారని అభియోగాలున్నాయి. తెలంగాణలో ప్రభుత్వం మారిన సమయంలో ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ ఆడియో రికార్డు చేసిన హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేశారని పోలీసులు గుర్తించారు. ప్రణీత్ రావును విచారించగా.. అతను ఇచ్చిన సమాచారంతో మరికొందరి అరెస్టులు జరుగుతున్నాయి. తరువాత భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేసిన దర్యాప్తు బృందం మార్చి 28న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. 


Also Read: KTR: 'కాంగ్రెస్ లోనే ఏక్ నాథ్ శిండేలు ఉన్నారు' - ఎన్నికల్లో ఓటమిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు