Two Persons Kidnapped In Gachibowli: ఆర్థిక లావాదేవీలు అనేక వివాదాలకు కారణమవుతున్నాయి. అప్పటి వరకు స్నేహంగా ఉన్నవాళ్లు కూడా శత్రువులుగా మారిపోతున్నారు. ఏళ్ల తరబడి కొనసాగించిన బంధాన్ని కూడా ఒక్కసారిగా తెంచుకుని బద్ధ శత్రువులైపోతున్నారు. ఈ తరహా ఘటనలు ఈ మధ్య కాలంలో అనేకం పెరుగుతున్నాయి. తాజాగా అటువంటి ఘటనే హైదరబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఆర్థిక వ్యవహారాల్లో వచ్చిన తేడా కారణంగా సహచరులను బెదిరించి కిడ్నాప్‌ చేసిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఎస్‌వోటీ పోలీసులమంటూ ఓ కంపెనీ ఎండీతోపాటు సేల్స్‌ కో-ఆర్డినేటర్‌ను దుండగులు కిడ్నాప్‌ చేశారు. గచ్చిబౌలిలో ఒక కంపెనీ నిర్వహిస్తున్న సాయి గుప్తాను గతంలో వ్యాపార భాగస్వామిగా ఉన్న గౌతమ్‌ భవిరిశెట్టి కిడ్నాప్‌ చేయించినట్టు పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా సాయి గుప్తా, గౌతమ్‌ మధ్య ఆర్థిక లావాదేవీలు విషయంలో గొడవులు జరుగుతున్నాయి. ఈ గొడవలు ఈ మధ్యకాలంలో మరింత పెరగడంతో ఇద్దరి మధ్య అగాధం మరింత పెరిగింది. దీంతో వీరి మధ్య ఇన్నాళ్లు ఉన్న స్నేహం కాస్త శత్రుత్వంగా మారిపోయింది. ఈ క్రమంలోనే కిడ్నాప్‌కు యత్నించారు.


శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలు సమయంలో సాయి గుప్తా కారులో వెళ్లుండగా దుండగులు ఫార్చునర్‌, ఐ20 కార్లలో వచ్చి అతడిని కారును ఢీ కొట్టారు. అనంతరం ఎస్‌వోటీ పోలీసులమని చెప్పి సాయి గుప్తాను, అతడితోపాటు ఉన్న సేల్స్‌ కో-ఆర్డినేటర్‌ను వారి కారులో ఎక్కించుకున్నారు. మొదట యాదగిరి గుట్టలోని నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరిపై తీవ్రంగా దాడి చేశారు. అనంతరం చంపేస్తామని బెదిరించారు. కుటుంబ సభ్యులతో రూ.4 కోట్లు తెప్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే వారిని తీవ్ర స్థాయిలో ఒత్తిడికి గురి చేశారు. అక్కడి నుంచి తిరిగి వికారాబాద్‌ తీసుకెళ్లి అక్కడ మరోసారి తీవ్ర స్థాయిలో దాడికి పాల్పడ్డారు. 


కుటుంబ సభ్యుల ఫిర్యాదు..


సాయి గుప్తా కిడ్నాప్‌ వ్యవహారం కుటుంబ సభ్యులకు తెలిసింది. డబ్బులు కోసం కటుంబ సభ్యులకు ఫోన్‌ చేయడంతో వారు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు గాలింపు చేపట్టారు. పోలీసులు తమ కోసం గాలిస్తున్నారని తెలుసుకున్న దుండగులు ఖాళీ బాండ్‌ పేపర్లపై సంతకాలు చేయించుకుని ఇద్దరినీ వికారాబాద్‌లో విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఈ కేసును చేధించే పనిలో పోలీసులు ఉన్నారు. ఇప్పటికే కీలకమైన ఆధారాలను సేకరించారు. కిడ్నాప్‌ వ్యవహారంలో మొత్తం 13 మంది ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కిడ్నాప్‌కు సూత్రదారి గౌతమ్‌ పోలీసులు అదుపులో ఉన్నట్టు సమాచారం. మిగిలిన వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన గొడవలే కిడ్నాప్‌కు కారణమైనట్టు పోలీసులు చెబుతున్నారు. మిగిలిన విషయాలు ఉంటే విచారణలో బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.