సహజంగా మరణించినవారు ప్రమాదంలో మరణించారనే నకిలీ డాక్కుమెంట్లు సృష్టించి కార్మిక శాఖను బురిడీ కొట్టించారు కొందరు కేటిగాళ్లు. ఒకటి రెండు కాదు ఏకంగా రూ.6.3 లక్షలు కాజేశారు. చివరికి కార్మిక శాఖ ఈ విషయంపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం కాస్తా బయటపడింది. 
సహజ మరణాన్ని ప్రమాదంగా మార్చి..
కొణిజర్లకు చెందిన సీతమ్మ భర్త అప్పారావు 2020లో సహజ మరణం పొందారు. ఇతనిపై కార్మిక శాఖలో బీమా ఉండటంతో దానిని కాజేయాలని భావించిన స్థానిక ఏజెంట్లు బండారు సత్యనారాయణ, గణపతి, వెంకటేశ్వర్లు అప్పారావు మరణాన్ని ప్రమాదంగా చిత్రీకరించారు. అందుకు కావాల్సిన నకిలీ  ధ్రువపత్రాలు తయారు చేసి మధిరలోని కార్మిక శాఖకు అందించి బీమా సొమ్మును కాజేశారు. ఈ దందాలో కేటుగాళ్లు ముందుగానే బాధితుల మాట్లాడి వారితో కమీషన్‌ మాట్లాడుకుని ఈ బీమా సొమ్మును కాజేశారు
ఏకంగా నకిలీ ఎఫ్‌ఐఆర్‌లు తయారీ..
సహజంగా మరణించిన వారు ప్రమాదంగా చిత్రీకరించేందుకు తప్పనిసరిగా పోలీస్‌ స్టేషన్‌ ఎప్‌ఐఆర్, పంచనామాలు అవసరం. బీమా సొమ్ములను కాజేసేందుకు ఏకంగా నకిలీ ఎఫ్‌ఐఆర్‌లతోపాటు నకిలీ పంచనామాలు సృష్టించారు. ఈ కేసు విషయంలో ఇలా నకిలీ ధ్రువపత్రాలు తయారు చేయించినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది.


వైరాకు చెందిన ఉపేందర్‌ అనే వ్యక్తి నకిలీ ధ్రువపత్రాలు తయారు చేయగా శంబురెడ్డి అనే వ్యక్తి నకిలీ స్టాంపులను తయారు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇలా నకిలీ  ధ్రువపత్రాలు, స్టాంపులు తయారు చేసి బీమా సొమ్ములు కాజేసిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 
నకిలీ దృవపత్రాలతో రూ.కోట్లు స్వాహా..
కార్మిక శాఖ అందిస్తున్న బీమాను కాజేసేందుకు నకిలీ ధ్రువపత్రాలు తయారు చేస్తున్న ఈ ముఠా ఇప్పటి వరకు కోట్లలో స్వాహా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల, బోనకల్లు, చింతకాని, మధిర, ఖమ్మంరూరల్, రఘునాధపాలెం మండలాల్లో ఈ సంఘటనలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


గతంలో చనిపోయిన వ్యక్తులను సైతం ఇటీవలే మరణించినట్లు  ధ్రువీకరణ పత్రాలు తయారు చేస్తూ దానికి కావాల్సిన డాక్యుమెంట్లు సృష్టించి బీమా సొమ్ములు కాజేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పోలీసు శాఖ మరింత లోతుగా విచారణ నిర్వహిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నట్లు  స్థానికులు చెబుతున్నారు.  


ఈ విషయం తెలిసిన స్థానికులు ఒక్కసారి అవక్కాయ్యారు. ఇలాంటి మోసాలు కూాడా జరుగుతాయా అంటు ముక్కున వేలేసుకున్నారు. ఇందులో బాధితుల పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది.