Ugadi 2022 Celebration: తెలుగు రాష్ట్రాల్లో ఎటుచూసినా శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందడి కనిపిస్తోంది. తెలుగు వారి పెద్ద పండుగల్లో ఒకటైన ఉగాది మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే మనకు కొత్త ఏడాది యుగాది (Ugadi 2022) నుంచి ప్రారంభం అవుతుందని పూర్వీకుల నుంచి భావిస్తున్నాం. ఏపీలో సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన  ఉగాది వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఉగాది వేడుకల్లో, పంచాంగ శ్రవణంలో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు.


పేరుకు తగ్గట్లే శుభాలు.. 
శ్రీ శుభకృత్‌ నామ ఉగాది సంవత్సరం.. పేరుకు తగ్గట్లుగానే ఈ ఏడాది ఏపీ ప్రజలకు అన్నీ శుభాలే కలుగుతాయట. ఏపీ దేవాదాయ శాఖ ఆస్థాన సిద్ధాంతి కప్పగంతు సుబ్బరామ సోమయాజి ఉగాది రోజున పంచాంగ పఠనం చేశారు. చాలా మంచి పథకాలతో ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఈ ప్రభుత్వానికి దొరుకుతుందని చెప్పారు. అయితే కొన్ని విషయాలలో ఓర్పుగా వ్యవహరిస్తేనే అవాంతరాలు తొలగిపోతాయని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ పరిపాలనకు తగ్గట్లుగా రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉంటారని చెప్పారు. శుభకృత్‌ అంటే ఈ ఏడాది మొత్తం మంచి పనులు జరుగుతాయని, దానివల్ల ప్రజలకు మేలు జరుగుతుందని పంచాంగ పఠనం చేశారు. 











‘ఈ సంవ‌త్స‌రం రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభం జ‌రుగుతుంద‌ని పంచాంగం చెబుతుంది. దేవుడి ద‌య‌, ప్ర‌జ‌లంద‌రి దీవెన‌లు మ‌న ప్ర‌భుత్వానికి ఇంకా బ‌లాన్ని ఇవ్వాల‌ని, ఈ సంవ‌త్స‌రం అంతా ప్ర‌జ‌లంద‌రికీ ఇంకా మంచి చేసే ప‌రిస్థితులు రావాల‌ని మ‌న‌సారా కోరుకుంటున్నా..’ అని సీఎం జగన్ అన్నారు.


సంక్షేమ క్యాలెండర్ ఆవిష్కరణ..
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభకాంక్షలు తెలిపారు. సంక్షేమ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన సీఎం జగన్ ఈ ఏడాది రాష్ట్ర ప్రజలకు అంతా శుభాలే కలుగాలని ఆకాంక్షించారు. పంచాగకర్త, సిద్ధాంతి కప్పగంతు సుబ్బరామ సోమయాజిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీ సీఎం జగన్ సన్మానించారు. అనంతరం సీఎం జగన్‌కు విశాఖ శారదా పీఠం తరఫున సిద్ధాంతి ఆయనకు పట్టు వస్త్రాలు అందజేసి ఆశీర్వదించారు.