Youth Died in The River After Holi Celebrations: హోలీ పండుగ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కుమురం ఆసిఫాబాద్ (Asifabad) జిల్లాలోని నదిలో స్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు. కౌటాల మండలం తాటపల్లి వద్ద వార్దా నదిలో స్నానానికి దిగిన నలుగురు యువకులు లోతు అంచనా వేయలేక ఒక్కొక్కరుగా మునిగిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో నదిలో గాలింపు చేపట్టగా.. నలుగురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు నదీమాబాద్ కు చెందిన సంతోష్ కుమార్, ప్రవీణ్, సాయి, కమలాకర్ గా గుర్తించారు. మృతులంతా 25 ఏళ్ల లోపు వారే కాాగా.. గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఘటనా స్థలం వద్ద మృతుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో చోట..
మరోవైపు, మంచిర్యాల (Mancherial) జిల్లా దండేపల్లి మండలం తానిమడుగు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాల్వలో స్నానానికి వెళ్లిన మరో యువకుడు మృతి చెందాడు. మృతుడు జన్నారం మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన కార్తిక్ గా గుర్తించారు. అటు, మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని అహ్మద్ గూడకు చెందిన మంద నరేశ్ కుమార్ అనే విద్యార్థి ఆదివారం చెరువులో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపట్టగా.. సోమవారం ఉదయం మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వాటర్ ట్యాంక్ కూలి
అటు, నారాయణపేట జిల్లా కేంద్రంలోని గోపాల్ పేట వీధిలో లక్ష్మి ప్రణతి అనే బాలిక హోలీ సందర్భంగా స్నేహితులతో సరదాగా ఆడుకుంది. రంగు బాటిల్స్ నింపుకొనేందుకు స్నేహితులతో కలిసి వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లగా.. ఒక్కసారిగా ట్యాంక్ కుప్పకూలింది. ఈ క్రమంలో శిథిలాలు వారిపై పడి.. బాలిక మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే బాధితులను ఆస్పత్రికి తరలించారు. బాలిక మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.