Harish Rao Demands Congress Govt to implement Guranties to Farmers: హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి తెరవాల్సింది కాంగ్రెస్ పార్టీ గేట్లు కాదు, రైతుల పంట పొలాలకు నీళ్ల కోసం ప్రాజెక్టు గేట్లు తెరవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) రైతులకు అండగా ఉంటుందని, నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులు వెళ్లి రైతుల (Telangana Farmers) సమస్యలు తెలుసుకోవాలని కేసీఆర్ మార్గనిర్దేశం చేసినట్లు హరీష్ రావు తెలిపారు. దేశంలోనే తొలిసారి రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ (Telangan Former CM KCR) అని కొనియాడారు. రైతు బీమా పథకం దేశంలో, ప్రపంచంలో మరెక్కడా లేదని.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిని తీసుకొచ్చి విజయవంతంగా అమలు చేసిందన్నారు. దురదృష్టవశాత్తూ రైతు చనిపోతే వారి కుటుంబానికి అండగా నిలిచేందుకు రూ.5 లక్షల రైతు బీమా కేసీఆర్ తెచ్చారని గుర్తుచేశారు. 


రైతులకు ఎకరానికి 25 వేల ఆర్థికసాయం
బీఆర్ఎస్ తమ నియోజకవర్గాల్లో పర్యటించి ఎండిపోయిన, అకాల వర్షాలకు నష్టపోయిన పంటల వివరాలను సేకరించాలని పార్టీ శ్రేణులకు హరీష్ రావు సూచించారు. రైతులకు నష్టపోయిన ప్రతి ఎకరానికి రూ.25 వేలు ఆర్టికసాయం చేసి వారిని ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది ప్రకృతి విపత్తుల కిందకు వస్తుందని, దీనికి ఎలక్షన్ కోడ్ లాంటివి అడ్డంకి కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులకు నేటికీ రైతు బంధు అందలేదని, మరోవైపు కేంద్రంలో ఉన్న బీజేపీకి రైతులు అంటే అసలు ఇష్టం ఉందని రెండు పార్టీలపై విమర్శలు గుప్పించారు. కరువు పరిస్థితిని సమీక్షించాలని కేంద్రం అడగదు, మరోవైపు రాష్ట్రం పట్టించుకోవడం లేదు. మధ్యలో అన్నదాతలు ప్రాణాలు కోల్పోతున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. 


కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ చేరికలపై ఫోకస్ చేస్తోంది. కానీ రైతుల కన్నీళ్లు తుడవడం, వారికి సాగునీళ్లు, కరెంట్ ఇవ్వడంపై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చి.. కరువు వల్ల, అకాల వర్షాలు, ఇతర కారణాలతో పంటలు నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి వారికి ఎకరానికి రూ.25 వేలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులెవరూ అప్పులు తిరిగి చెల్లించకూడదని, మిమ్మల్ని ఎవరైనా వేధిస్తే బీఆర్ఎస్ దృష్టికి తీసుకొస్తే తాము అండగా ఉంటామన్నారు. అసెంబ్లీలోనూ ఈ విషయంపై కోట్లాడతాం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలపై దిగి రాకపోతే, లక్షలాది మంది రైతులతో సెక్రటేరియల్ ముట్టడికి వెనుకాడమని హెచ్చరించారు. మిమ్మల్ని ఇంతలా వేధిస్తున్న కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో అన్నదాతలు కర్రుకాల్చి వాత పెట్టాలన్నారు.


అధికారం కోసం ఓకే.. ఇక మారరా!
అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చేందుకు సోషల్ మీడియాను వాడుకుని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారు. కానీ అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ నేతల తీరు మారలేదు. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలను అమలు చేయడం కాదు, కేసీఆర్ అమలు చేసిన పాత పథకాలను కూడా అమలు సైతం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదంటూ మండిప్డారు. నాణ్యమైన కరెంట్ లేదు, కాలువలకు నీళ్లు లేవు, రైతు బంధు లేదు, రైతు బీమా ఊసే లేదని.. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇప్పుడు వడ్లు వస్తున్నాయి, హామీ ఇచ్చినట్లుగా మద్దతు ధరతో పాటుగా క్వింటాల్ కు రూ.500 బోనస్ కలిపి కొనుగోలు చేయాలని.. ఈ విషయంలో ఎంతవరకైనా వెళ్లి పోరాటం చేస్తామని హెచ్చరించారు.