Bus Boltha: గుంటూరు జిల్లా కల్లిపర మండలం దంతలూరు గ్రామ శివారు వద్ద ఉన్న రోడ్డు చాలా చిన్నగా ఉంది. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న తెనాలి నారాయణ స్కూల్ బస్సు బోల్తా పడింది. డ్రైవర్ చాకచక్యంగా వ్వవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ నలుగురు విద్యార్థులకు మాత్రం స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే విషయం గుర్తించిన స్థానికులు వెంటనే పిల్లలను కిందకు దింపారు. ఘటనలో గాయపడ్డ విద్యార్థులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది విద్యార్థులు ఉన్నారు. 


చిన్న రోడ్డు.. అది చాలదన్నట్లు పక్కనే కాలువ!


దంతలూరు గ్రామానికి 7.30 గంటలకు వచ్చిన బస్సు.. పిల్లలను ఎక్కించుకొని పాఠశాలకు బయలు దేరింది. ఈ క్రమంలోనే గ్రామ శివారు దాటేటప్పుడు బస్సు ప్రమాదానికి గురైంది. నిన్న సాయంత్రం వ్షం కురవడం, పక్కనే కాలువ ఉండటం.. అది చాలదన్నట్లు రోడ్డు చిన్నగా ఉండడంతోనే ప్రమాదం జరగిందని పాఠశాల బస్సు డ్రైవర్ చెబుతున్నాడు. బస్సు బోల్తా పడినప్పటికీ.. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం వల్లే పిల్లల ప్రాణాలు కాపాడగల్గినట్లు స్థానికులు చెబుతున్నారు. 


డ్రైవర్ వల్లే మా పిల్లల ప్రాణాలు దక్కాయి..


గత కొంత కాలంగా రోడ్డును పెద్దగా చేయాలని అధికారులకు విన్నవవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఈరోజు ఏమైనా జరిగి ఉంటే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వచ్చేదని అంటున్నారు. దాదాపు 25 కుటుంబాలు తమ పిల్లలను కోల్పోవాల్సి వచ్చేదని.. అందరి అదృష్టం బాగుండటం వల్లే పిల్లల ప్రాణాలు దక్కాయని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని కోరుతున్నారు. చిన్నగా ఉన్న ఆ రోడ్డపై వెళ్లాలంటే ఆటో డ్రైవర్లు కూడా చాలా భయపడుతున్నారని గ్రామస్థులు వివరించారు.


ఇప్పటికైనా పట్టించుకోండయ్యా..! 


రోడ్డు విస్తరణ పనులు చేపట్టే వరకు తమ పిల్లలను బడికి పంపించలేమని కొందరు తల్లిదండ్రులు చెబుతున్నారు. పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే ఆ నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని అంటున్నారు. గతంలోనూ ఈ రోడ్డుపై చాలానే ప్రమాదాలు జరిగాయని చెప్పారు. అయినా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించడం లేదని, ఏదైనా పెద్ద ప్రమాదం జరిగే వరకు స్పందించరేమో అంటూ మండి పడుతున్నారు. ఎన్నికల అప్పుడు వచ్చి హామీలు ఇచ్చే నాయకులు.. ఇప్పుడు ఏమైపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగక ముందే రోడ్డును విస్తరించమని ప్రాధేయ పడుతున్నారు. రోడ్డు పనులు చేస్తామని హామీ ఇచ్చే వరకు గ్రామంలోకి ఏ నాయకులు, అధికారులు వచ్చినా ఊరుకోమని చెబుతున్నారు.