జగనన్న తోడు – చిరు వ్యాపారుల ఉపాధికి ఊతం ఇస్తుందని ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి ఒక్కొక్కరికి ఏటా రూ. 10 వేల చొప్పున వడ్డీలేని రుణం అందిస్తే.. వారి కాళ్లమీద వారిని నిలబెట్టేందుకు ఉపయోగ పడుతుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు.
చిరు వ్యాపారులు, చేతి వృత్తుల వారికి వడ్డీ లేని రుణాలు..
పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికీ రూ. 10 వేల చొప్పున 3.95 లక్షల మంది చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి బ్యాంకుల ద్వారా కొత్తగా రూ. 395 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు, గత ఆరు నెలలకు సంబంధించిన రూ. 15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను నేడు (03.08.2022, బుధవారం) క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమచేయనున్నారు సీఎం వైఎస్ జగన్. ఈ పథకం ద్వారా అందిస్తున్న రూ. 395 కోట్ల రుణంతో కలిపి ఇప్పటివరకు 15,03,558 లబ్ధిదారులకు అందించిన వడ్డీ లేని రుణాలు రూ. 2,011 కోట్లు, నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటివరకు 15,03,558 లబ్ధిదారులకు (వీరిలో సకాలంలో రుణాలు చెల్లించి రెండోసారి రుణం కోరి పొందినవారు 5,07,533) బ్యాంకుల ద్వారా అందించిన వడ్డీ లేని రుణాలు రూ. 2,011 కోట్లు. సకాలంలో రుణాలు చెల్లించిన 12.50 లక్షల లబ్ధిదారులకు వైఎస్ జగన్ ప్రభుత్వం తిరిగి చెల్లించిన వడ్డీ రూ. 48.48 కోట్లు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణాలు..
చిరు వ్యాపారులు రోజువారీ పెట్టుబడి ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్ధితి లేకుండా, వారి పరిస్ధితి మార్చాలన్న సమున్నత లక్ష్యంతో అర్హులైన ప్రతి ఒక్కరికి వడ్డీ లేని రుణాలు అందిస్తున్న ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వం. లబ్ధిదారులు బ్యాంకులకు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రతి ఆరు నెలల కోసారి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా ప్రభుత్వమే చెల్లిస్తుంది. రుణం తీరిన తర్వాత లబ్ధిదారులు మరోసారి వడ్డీలేని రుణం పొందడానికి అర్హులు. వారికి బ్యాంకులు మళ్లీ వడ్డీలేని రుణాలు ఇస్తాయి.
వీరందరికీ జగనన్న తోడు...
గ్రామాలు, పట్టణాల్లో సుమారు 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారు, ఫుట్‌పాత్‌ల మీద, వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్ధాలు విక్రయిస్తూ జీవించే వారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు, గంపలు, బుట్టలలో వస్తువులు అమ్మేవారు, సైకిల్, మోటర్ సైకిళ్ళు, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకునేవారికి జగనన్న తోడు లభించనుంది.
వారితోపాటు చేనేత మరియు సంప్రదాయ చేతివృత్తుల కళాకారులైన ఇత్తడి పని చేసేవారు, బొబ్బలివీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కలంకారీ, తోలుబొమ్మలు, ఇతర సామాగ్రి తయారీదారులు, లేస్ వర్క్స్, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారు వడ్డీలేని రుణాలు పొందడానికి అర్హులు. ఈ అవకాశం ఇప్పటికి దక్కని వారు , అర్హత ఉండీ జాబితాలో పేర్లు నమోదు కానివారు కంగారు పడాల్సిన పనిలేకుండా, గ్రామ, వార్డు వలంటీర్లను సంప్రదించవచ్చునని, లేదా సమీప గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చునని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
కాల్ మని కేటుగాళ్ల నుండి విముక్తి....
చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి వడ్డీలు తీసుకోవడంతో కాల్ మనీ కేటుగాళ్ల నుంచి వేధింపులు అధికంగా ఉండేవి. వడ్డీ వసూలు చేసుకోవటంతో పాటుగా , వ్యాపారుల అవసరాలు ఆసరాగా చేసుకొని వారి బలహీనతలను తమకు అనుకూలంగా మార్చుకొని కొందరు వడ్డీ వ్యాపారులు కాల్ మనీని తెరమీదకు తీసుకువచ్చారు. దీంతో ఎంతో మంది చిరు వ్యాపారులు ఆర్థికంగా నష్టపోవటంతో పాటుగా కుటుంబాలు కూడా ఛిన్నాభిన్నం అయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ప్రభుత్వం స్వయంగా జగనన్న తోడు ద్వారా భరోసా కల్పించింది.
Also Read: నెలరోజుల గ్యాప్ లో నెల్లూరుకి సీఎం జగన్.. ఎందుకంటే..?