Four People Died Due To An Ambulance Overturned: మధ్యప్రదేశ్‌లో అంబులెన్స్ ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఓ రోగిని కర్నూలు జిల్లా నుంచి బిహార్‌లోని చంపారన్‌కు తరలిస్తుండగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో ఆదివారం ఉదయం ఓ పాదచారుడిని ఢీకొట్టిన అంబులెన్స్ ఆ తర్వాత స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. జబల్‌పుర్ - నాగ్‌పుర్ హైవేపై (ఎన్‌హెచ్ 34) జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. అనిష్ షా (18) అనే రోగిని కర్నూలు నుంచి బిహార్‌లోని చంపారన్‌లో తమ స్వగ్రామానికి తరలిస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.


ప్రమాద సమయంలో అంబులెన్సులో ఇద్దరు డ్రైవర్లతో సహా అనిష్ షా కుటుంబ సభ్యులు ఆరుగురు ఉన్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో పాదచారుడిపైకి దూసుకెళ్లిన అంబులెన్స్.. ఆ తర్వాత ఓ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను ప్రమిత షా (35), ప్రిన్స్ షా (4), ముకేశ్ షా (36), సునీల్ షా (40)గా గుర్తించారు. క్షతగాత్రులను జబల్‌పుర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


ఛత్తీస్‌గఢ్‌లోనూ ఘోర ప్రమాదం


అటు, ఛత్తీస్‌గఢ్‌లోనూ ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాయ్‌పూర్ నుంచి అంబికాపూర్ వెళ్తున్న కారును ట్రక్కు ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సుర్గుజా జిల్లా అంబికాపూర్ - బిలాస్‌పూర్ జాతీయ రహదారి 130పై ఉదయపూర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను కట్టర్స్ సాయంతో వెలికితీశారు. మృతులు చంగురభఠా రాయ్‌పూర్ వాసులుగా గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Maharastra CM: ఉత్కంఠకు తెర పడుతుందా? - రేపే మహారాష్ట్ర సీఎం పేరు ఖరారు!