Maharastra CM Candidate: మహారాష్ట్రలో బంపర్ మెజారీటీతో అధికారం తిరిగి దక్కించుకున్న మహాయుతి కూటమి తరఫున సీఎం ఎంపికలో ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. ఫలితాలు వచ్చి, పది రోజులు గడుస్తున్నప్పటీకి సీఎం అభ్యర్థిని కూటమి నేతలు ప్రకటించలేదు. ముఖ్యంగా కూటమిలో అత్యధికంగా వందకు పైగా స్థానాలు దక్కించుకుని అతి పెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ.. సీఎంగా తమ అభ్యర్థిని పీఠం ఎక్కించాలని భావిస్తోంది. రెండుసార్లు సీఎంగా పని చేసి, గత సర్కారులో ఉప ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన దేవేంద్ర ఫడ్నవీస్.. మళ్లీ ఇంకోసారి ముఖ్యమంత్రిగా ఎంపికవ్వాలని పావులు కదుపుతున్నారు. 


షరతులు వర్తిస్థాయి..


అయితే.. కూటమిలోని మిగతా భాగస్వామ్యులైన శివసేన, ఎన్సీపీలు కూడా అధికారంలో వాటాకు తహతహలాడుతున్నాయి. ముఖ్యంగా శివసేనకు చెందిన అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే.. తన సీఎం పీఠం వీడేందుకు బెట్టు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు కూటమి నేతలు చర్చల్లో మునిగి తేలుతుండగా, మరోవైపు అర్ధాంతరంగా తన స్వగ్రామం సతారా జిల్లాలోని దారే గ్రామానికి షిండే రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై షిండే నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కూటమికి తన అన్ కండీషనల్ సపోర్టు ఉంటుందని, సోమవారం సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని పేర్కొన్నారు.


మాములుగానే తాను స్వగ్రామానికి వచ్చానని, తీరిక లేని షెడ్యూల్‌తో అలసిపోయానని, అందుకే స్వగ్రామంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు షిండే తెలిపారు. అయితే ఆయన్ను కలిసేందుకు అభిమానులు పొటేత్తడంతో కాస్త అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే ముంబైకి వెళ్తారని సమాచారం. నిజానికి ఈసారికి కూడా సీఎం పీఠం అధిష్టించాలనే షిండే భావించారు. తనకు కాకపోతే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండేనైనా గద్దెనెక్కించాలని భావించారు. అయితే ఆయన ప్రయత్నాలు ఫలించలేక పోవడంతో సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి బీజేపీ కీలకనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. 


స్వర్ణయుగపు పాలన..


అసెంబ్లీ ఎన్నికల్లో అఖండమైన మెజారిటీ సాధించిన క్రెడిట్‌ను షిండే తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించారు. తన రెండున్నరేళ్ల పాలన చరిత్ర పుటల్లో లిఖించదగినదని, తన పాలన కారణంగానే మహాయుతి కూటమి బంపర్ మెజారిటీ సాధించిందని పేర్కొన్నారు. ఇక సీఎం అభ్యర్థి విషయంలో బీజేపీ రాష్ట్ర నేతలు చిలక పలుకులు పలుకుతున్నారు. 


ప్రజలందరీకి తెలుసు.. 


ప్రజలందరూ ఊహిస్తున్నట్లుగానే సీఎం అభ్యర్థి ఉంటారని బీజేపీ మహారాష్ట్రకు చెందిన కేంద్ర మాజీ మంత్రి రావుసాహెబ్ ధన్వే తెలిపారు. ఇప్పటికే పేరు ఖరారైందని, కేంద్ర అధిష్టానం నుంచి ఆమోద ముద్ర లభించాల్సి ఉందని చెప్పారు. మొత్తానికి ఫడ్నవీసే మళ్లీ సీఎం అవుతారని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇక కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ నెల 5న జరుగుతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ భవాంకులే తెలిపారు. దక్షిణ ముంబైలోని అజాద్ మైదాన్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. ఈ సమావేశానికి ప్రతేక ఆకర్షణగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని తెలిపారు.  


Also Read: Gautam Adani: ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ