"దొంగల బడి" సినిమాల్లోనే ఉంటుంది. బయట ఎక్కడా కనిపించదు. కానీ ఇప్పుడు దొంగలు తమ చోరకళా విద్యను పదిమందికి ప్రదర్శించడానికి యూట్యూబ్ వేదికగా చేసుకుంటున్నారు. అందులో దొంగతనాలు నేర్చుకుని డిగ్రీలు.. పీహెచ్‌డీలు చేసి రోడ్డు మీదకు వస్తున్నారు. వీరు గురువుల్ని మించిపోతున్నారు. ఇలాంటి ఓ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు చేసిన స్నాచింగ్‌లు.. వీరి స్నాచింగ్ టాలెంట్‌ను చూసి పోలీసులకే మైండ్ బ్లాంకయిందంటే.. ఎంతగా చైన్లు కొట్టేయడంలో రాటుదేలిపోయారో అర్థం చేసుకోవచ్చు. 


రాచకొండ కమిషనరేట్ పరిధిలో మే నెలలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలు జరిగాయి. ఆ తర్వాత జూలైలోనూ అదే తరహాలో చైన్లు లాక్కెళ్లిపోయారు. మొత్తంగా ఆరు చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. అంతా ఒకే ముఠా చేస్తుందని ఓ అంచనాకు వచ్చిన రాచకొండ పోలీసులు... మొత్తం  సీసీ కెమెరాలను జల్లెడపట్టారు. ఈ కేసులను చాలెంజింగ్‌గా తీసుకుని మొత్తం దృశ్యాలు వడబోశారు. ఐటిసెల్, సీసీఎస్‌లతో రాచకొండ సీపి మహేష్ భగవత్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఓ చోట సీసీ కెమెరాలో ఓ చైన్ స్నాచర్ ముఖం కనిపించింది. అంతే.. దాన్ని పట్టుకుని తీగ లాగారు. మొత్తం కథ బయటకు వచ్చారు. 


 చైన్ స్నాచింగ్‌ ముఠాలో మొత్తం ఐదుగురు ఉన్నారు. వీరంతా కడపకు చెందిన వారు. ఐదుగురు ఐదు బాధ్యతల్ని పంచుకున్నారు. సయ్యద్ భాషా అనే వ్యక్తి పకడ్బందీగా మెడలోనుంచి చైన్‌లు లాగేస్తాడు..  షేక్ అయూబ్ అనే వ్యక్తి బైక్ డ్రైవిగ్ చేస్తాడు. క్యాబ్‌ డ్రైవర్‌గా షేక్ మహ్మద్ ఖలీద్ ఉంటాడు. వీరందరికి హెల్పర్‌గా నాగొల్లు శశిధర్ రెడ్డిని పెట్టుకున్నారు. చైన్ స్నాచింగ్‌లు చేసిన తర్వాత ఆ చైన్లను వెంటనే రిసీవర్‌కు ఇచ్చి మాయమవుతారు. ఆ రిసీవర్‌గా పఠాన్ జాఫర్ ఖాన్ అనే నిందితుడు వ్యవహరించేవారు. వీరందర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. 


వీరంతా ఇటీవలి కాలంలోనే చైన్ స్నాచింగ్ ముఠాగా ఏర్పడ్డారు. యూట్యూబ్‌లో చైన్ స్నాచింగ్‌లు ఎలా చేయాలోనే నేర్చుకున్నారు. కడపలో ముఠాగా ఏర్పడి.. ముందుగా  తిరుపతి అర్బన్, విజయవాడ, నెల్లూర్, గుంటూరుల్లో చైన్ స్నాచింగ్‌లు చేశారు. అక్కడ మొత్తం 32మంది బాధితులుగా ఉన్నారు. రాచకొండ కమీషనరేట్ పరిధిలో ఆరు చోట్ల స్నాచింగ్ చేశారు. నిందితుల నుండి 10 లక్షల విలువ చేసే బంగారు నగలు, రూ. లక్షా 70 వేల నగదు, టయోటా కార్ సీజ్ చేశారు. ఇంకా వీరు చైన్ స్నాచింగ్‌లు దొంగతనాలు చేసి ఉంటారని.. ఫిర్యాదులు చేసి ఉండరని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు .