ఓ కాలనీలో ఓ కుర్రాడు ఉంటాడు. అందగాడు. బుద్దిమంతుడు. అందరితో కలివిడిగా ఉంటాడు. అతనికో గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. కానీ హఠాత్తుగా ఆమె కనిపించకుండా పోతుంది. కానీ ఇతగాడు మాత్రం మామూలుగానే ఉంటాడు. ఒంటరిగానే నివసిస్తూ ఉంటాడు. ఒక రోజు పోలీసులు  ఆ ఇంటినిచుట్టుముడతారు. సీన్ కట్ చేస్తే..  అత్యంత భయంకరమైన దృశ్యాలు కళ్ల ముందు కనిపిస్తాయి. మామూలు భయంకరం కాదు..  ఆ కుర్రాడ్ని చూస్తేనే దెయ్యం అని దడుచుకునేంత భయంకర దృశ్యాలు ఉంటాయి అక్కడ. ఇదేమీ సినిమా స్టోరీ కాదు. అమెరికాలో తాజాగా బయటపడిన ఓ సైకో స్టోరీ. 


సైకోలు ఎక్కడో ఉండరు. మన చుట్టూనే ఉంటారు. వారి నుదుటిపై సైకో అని ముద్రేమీ ఉండదు. బయటకు ఒకేలా కనిపిస్తూ ఉంటారు. కానీ వారు చేసిన పనులు చూస్తే ఒళ్ల గగుర్పొడుస్తుంది. సినిమాల్లో మాత్రమే కనిపించే క్రూర సైకోల గురించి తరచూ మాట్లాడుకుంటాం కానీ.. ఎదురు పడితే.. గుర్తించలేం వారు చేసే పనులు తెలిసేదాకా. అమెరికాలోని డెట్రాయిట్ సబర్బన్ ప్రాంతంలో మాధ్యూ అనే 37 ఏళ్ల వ్యక్తి నివసిస్తూ ఉంటాడు.  అతనికో గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఇద్దరూ సహజీవనం చేస్తూ ఉంటారు. హఠాత్తుగా ఆమె కనిపించడం మానేసింది. కాలనీలో వాళ్లు మాధ్యూని అడిగితే..ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవాడు. కానీ రెండు రోజుల కిందట.. కాలనీలో వాళ్లంతా భయపడే ఘటన జరిగింది. 


పెద్ద ఎత్తున పోలీసు వాహనాలు మాధ్యూ ఇంటిని చుట్టుముట్టి సెర్చ్ చేశాయి. బేస్‌ మెంట్‌లో మాధ్యూ ప్రియురాలి మృతదేహాన్ని గుర్తించారు. అప్పటికే ఆమె కనిపించకుండా పోయి ఏడు నెలలు అవుతోంది. ఏడు నెలల నుంచి చనిపోయిన ప్రియురాలి మృతదేహాన్ని ఇంట్లోని బెస్మెంట్‌లోనే భద్ర పరిచాడు మాధ్యు. అలా భద్రపరిచి..ఆమెతో కలిసి జీవిస్తున్నాడని అనుకుంటే... అదో రకమైన సైకో ప్రేమ అనుకోవచ్చు. కానీ అక్కడ విషయం అది కాదు. ఆమె శరీరంలో చాలా భాగాలను అక్కడక్కడ కొరికినట్లు.. కట్ చేసినట్లుగా ఆధారాలు లభించాయి. ఆ బాడీ పార్టులేమయ్యాయో  పోలీసులు గుర్తించలేకపోయారు. వాటిని తిన్నాడా.. లేకపోతే.. ఇంకేమైనా చేశాడా అన్నదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 


మాధ్యూ మనసిక స్థితిని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఎప్పుడు చంపాడు.. ఎలా చంపాడు.. ఎందుకు చంపాడు.. శరీర భాగాలను కొద్ది కొద్దిగా ఏం చేస్తున్నాడు.. ఇలాంటి వివరాలన్నింటినీ బయటకు తీసుకున్నారు. అమెరికాలో విచారణలు వేగంగా జరుగుతాయి. దీనిపై విచారణ జరుగుతోంది. పూర్తి వివరాలు విచారణ పూర్తయిన తర్వాత వెల్లడించే అవకాశం ఉంది. అయితే మాధ్యూ చేసిన పని మాత్రం అమెరికన్లందరిలోనూ వణుకు పుట్టించింది.