తిరుమలలో అద్దె గదులకు కరెంట్‌ బుకింగ్‌ చేసుకునే భక్తుల నుంచి కాషన్‌ డిపాజిట్‌ తీసుకునే విధానాన్ని టీటీడీ ప్రారంభించింది. తిరుమలలో 17 ఉప విచారణ కేంద్రాల్లో భక్తులకు గది తాళం ఇచ్చే సమయంలో కాషన్‌ డిపాజిట్‌ తీసుకుని ఖాళీ చేసే సమయంలో రిఫండ్‌ కేంద్రాల ద్వారా తిరిగి చెల్లిస్తున్నారు. ప్రస్తుతం కరెంట్‌ బుకింగ్‌ రూ.50 నుంచి రూ.500 వరకు అద్దె గదులు పొందిన భక్తుల నుంచి రూ.500 కాషన్‌ డిపాజిట్‌ వసూలు చేస్తుండగా, రూ.501 నుంచి రూ.1000 వరకు, రూ.1001 నుంచి రూ.6,000 వరకు అద్దె ఉన్న గదులకు అంతే మొత్తంలో కాషన్‌ డిపాజిట్‌ తోపాటు, జీఎస్టీని భక్తుల నుంచి తీసుకుంటున్నారు. గదులను ఖాళీ చేసిన సమయంలో కాషన్‌ డిపాజిట్‌ తిరిగి ఇచ్చేందుకు గతంలోనే ఏర్పాటు చేసిన రిఫండ్‌ కౌంటర్లను ప్రస్తుతం అందుబాటులోకి తీసుకువచ్చారు. అక్కడ కాషన్‌ డిపాజిట్‌ వివరాలను ప్రదర్శిస్తున్నారు. 




అయితే ఇదంతా భక్తులకు సమస్యగా ఉందని భావించి 2017లో కాషన్‌ డిపాజిట్‌ విధానాన్ని రద్దు చేశారు. ఇక్కడ గతంలో ఉన్న అద్దె గదులకు నగదు డిపాజిట్‌ చెల్లించడాన్ని ఐదేళ్ల కిందట తీసేశారు. దీన్ని తొలగించాక అద్దె గదులను భక్తులు ఖాళీ చేసినప్పుడు సరైన సమాచారం సంబంధిత ఏరియా అటెండరుకు అందించకపోతే అద్దె భారం ఆయనపై పడేది. దీంతోపాటు సంబంధిత గదుల్లో విలువైన వస్తువులు చోరీ అయిన సంఘటనలున్నాయి. ఈ నేపథ్యంలో కరెంట్‌ బుకింగ్‌ అద్దె గదులకు డిపాజిట్‌ తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారుల దృష్టికి సిబ్బంది తీసుకెళ్లారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించారు. ఈ కాషన్‌ డిపాజిట్‌ విధానాన్ని తిరిగి గురువారం నుంచి ఆచరణలోకి  తీసుకొచ్చారు.


అయితే డిపాజిట్‌ విధానంలోని సమస్యలను దృష్టిలో పెట్టుకుని భక్తులు డిపాజిట్‌ సొమ్మును తిరిగి పొందేందుకు ఇబ్బందులు తలెత్తకుండా కొన్ని మార్పులు చేశారు. ప్రస్తుతం తిరుమలలో ఆరు ప్రాంతాల్లో రూం రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఉన్నాయి. వీటిలో రిజిస్ర్టేషన్‌ చేసుకున్న భక్తుల సెల్‌ఫోన్‌కు కేటాయించిన గది ఏరియా ఉప విచారణ కార్యాలయ వివరాలు అందుతాయి. ఈ ప్రాంతానికి చేరుకుని అద్దెను క్రెడిట్‌/డెబిట్‌ కార్డు ద్వారా నగదు చెల్లించి గది పొందాల్సి ఉంటుంది. ఈ విధానాన్నే కొనసాగిస్తూ ఆయా ఉప విచారణ కార్యాలయంలో భక్తులు అద్దెతోపాటు డిపాజిట్‌ చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. అయితే కాషన్‌ డిపాజిట్‌ విధానం అమల్లోకి తీసుకొచ్చిన క్రమంలో డిజిటల్‌ పేమెంట్‌తోపాటు నగదుతో కూడా గదిని పొందేలా మార్పులు చేశారు. నగదు చెల్లించి గదిని పొందేవారికి డిపాజిట్‌ను నగదు రూపంలో ఇవ్వడంతో పాటు కార్డుల ద్వారా గదిని పొందే భక్తులకు డిపాజిట్‌ను తిరిగి వారి బ్యాంకు ఖాతాలోకి పంపేలా చర్యలు తీసుకున్నారు. 




శనివారం డయల్‌ యువర్‌ ఈవో


డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం ఆగ‌స్టు 7 శ‌నివారం తిరుప‌తి టీటీడీ పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో జరుగనుంది. ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం ఉంటుంది. ఈ  కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.