అనంతపురంలో ఎక్సైజ్ సిబ్బంది, అధికార పార్టీ నాయకలు మధ్య జరిగిన ఘర్షణ టాక్‌ ఆఫ్‌ ద టౌన్ అవుతోంది. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అధికారం ఉందన్న అహంకారంతో ఎక్సైజ్ సిబ్బందిపై దాడి చేసి తమ అనుచరుడిని ఎమ్మెల్యే అనుచరులు తీసుకెళ్లిపోయారని విమర్శిస్తున్నారు. అయితే అక్కడ తప్పంతా ఎక్సైజ్ సిబ్బందిదేనంటూ అధికార పార్టీ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. 
 
అనంతపురంలో నాయక్‌నగర్‌కు చెందిన సురేష్‌ తన ముగ్గురు మిత్రులతో కలిసి 30 మద్యం బాటిళ్లు తీసుకొస్తూ పోలీసులకు చిక్కాడు. జీసస్‌నగర్‌ ఏరియాలోని మోర్‌ వద్ద సెబ్‌ పోలీసులు వారిని పట్టుకున్నారు. ఇదే రచ్చకు కారణమైంది. సురేష్‌ను అకారణంగా స్టేషన్‌కు తీసుకెళ్లి లాకప్‌లో వేశారని స్థానికులు స్టేషన్‌లో గలాటా చేశారు. 


సురేష్‌పై కేసు పెట్టొద్దని స్థానికంగా అధికార పార్టీకి చెందిన వారంతా వచ్చి స్టేషన్‌లో తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని పోలీసులు చెబుతున్నారు. కార్పోరేటర్లు సాకే చంద్రశేఖర్, కమల్ భూషణ్ తన అనుచరులతో గల్జార్ పేట్‌లోని స్టేషన్‌లో హల్‌చల్ చేశారని అంటున్నారు. సాకే చంద్రశేఖర్ ఎస్సై కుర్చీలో కూర్చున్నారని పోలీసులు అభ్యంతరం తెలిపారు. అదంతా పబ్లిక్‌ ప్రాపర్టీ అని ఎక్కడైనా తిరుగుతామని బెదిరించారని వాపోయారు. 


పార్టీ చేసుకోవడానికి స్నేహితులతో కలిసి సురేష్ మద్యం తెచ్చుకున్నాడని అంటున్నారు స్థానికులు. మద్యం విక్రయించిన వారిని వదిలేసి కొనుగోలు చేసిన వ్యక్తిపై పోలీసులు రెచ్చిపోయారని అంటున్నారు. అరెస్టు చేసి లాకప్‌లో వేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై అడిగేందుకు వచ్చిన కార్పొరేటర్‌లపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తున్నారు. కుమారుడిని ఎందుకు హింసిస్తున్నారని అడిగిన సురేష్‌ తండ్రిని కూడా కొట్టారని అధికార పార్టీ లీడర్లు చెబుతున్నారు. ఇలా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. దీంతో సురేష్‌కు సపోర్ట్‌గా వచ్చిన వారంతా స్టేషన్‌లో ఆందోళనకు దిగారు. 


ఎక్సైజ్ పీఎస్ సిబ్బందిపై దాడి ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు.  మహిళా కానిస్టేబుల్ రాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ 145/23 కింద కేసు నమోదు చేశారు. వైరిపై ఐపీసీ u/s 323,186, 506, 506, 509 రెడ్ విత్ 34 సెక్షన్లు పెట్టారు. 


ఎక్సైస్ సిబ్బంది తమను కులం పేరుతో దూషించారని కార్పొరేటర్‌ చంద్రశేఖర్ అనుచరులు అనంతపురం టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని అన్యాయంగా కొట్టారంటూ సురేష్‌ తండ్రి కూడా కంప్లైంటే చేశారు. 


ఇదంతా ఎమ్మెల్యే అనుచరుల పనే అంటున్నాయి ప్రతిపక్షాలు. వారి ఒత్తడి తోనే పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగినా బెయిలబుల్ సెక్షన్లు పెట్టారని ఆరోపిస్తున్నారు. కేసును వీక్ చేసేందుకు అధికారపార్టీ నేతలు యంత్రాంగం నడిపారని ఆరోపిస్తున్నారు. పోలీసులపై దౌర్జన్యానికి దిగిన వార్డు వాలంటీర్లపై కేసులు ఎందుకు పెట్టలేని ప్రశ్నిస్తున్నారు 


చంద్రబాబు ఆగ్రహం 


అనంతపురం ఘటనపై చంద్రబాబు కూడా మండిపడ్డారు. మహిళా పోలీస్‌ల పట్ల దురుసుగా ప్రవర్తించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. దీనికి పోలీస్ సంఘాలు, పాలకులు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు.