Father Forceful Death After His Children Thrown Into A Well: తెలంగాణలో దారుణం జరిగింది. ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసి అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా (Kamareddy District) తాడ్వాయి మండలం నందివాడలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి (35), అపర్ణ దంపతులకు ఇద్దరు కుమారులు విఘ్నేష్ (6), అనిరుథ్ (4) ఉన్నారు. శనివారం రాత్రి 7:30 గంటలకు దుర్గమ్మ నిమజ్జనానికి శ్రీనివాస్ రెడ్డి పిల్లలను తీసుకెళ్లాడు. రాత్రి 10 గంటలు దాటినా వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన భార్య అతనికి ఫోన్ చేసింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అర్ధరాత్రి దాటాక 2 గంటల టైంలో ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దీనిపై ఆమె పోలీసులను ఆశ్రయించగా వారితో పాటు స్థానికులు సైతం వారి కోసం గాలింపు చేపట్టారు. 


వ్యవసాయ బావి వద్ద..


ఈ క్రమంలో ఆదివారం ఉదయం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో పిల్లల మృతదేహాలను గుర్తించారు. అప్పటికీ తండ్రి శ్రీనివాసరెడ్డి ఆచూకీ తెలియలేదు. ఆయన చెప్పులు, మొబైల్ సైతం బావి వద్దే ఉన్నట్లు పోలీసులు, స్థానికులు గుర్తించారు. పిల్లల మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు మోటారు సాయంతో బావిలోని నీటిని తోడించారు. అనంతరం శ్రీనివాసరెడ్డి మృతదేహాన్ని గుర్తించి వెలికితీయించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


నాగర్ కర్నూల్ జిల్లాలో..


అటు, నాగర్ కర్నూల్ జిల్లాలోనూ విషాదం నెలకొంది. ఓ ట్రాలీ ఆటో కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న సరస్వతి ఆలయం పక్కన గల కేఎల్ఐ కాలువలో ఆటో బోల్తా పడి.. మంతటి గ్రామానికి చెందిన ఫాతిమాబేగం అనే మహిళ మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. మంతటి గ్రామానికి చెందిన ట్రాలీ ఆటో అదే గ్రామానికి చెందిన కూలీలను తీసుకుని పొలానికి వెళ్తుండగా.. కాల్వ మలుపు వద్ద అదుపు తప్పి కాలువలో పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Crime News: అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచార ఘటన - పోలీసుల దర్యాప్తు ముమ్మరం, సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు